
50 వేల కోట్ల దోపిడీకి సర్కారు స్కెచ్: బండి సంజయ్
ముస్లింలను బీసీల్లో కలిపితే ఆమోదించేది లేదని వెల్లడి
పెద్దపల్లి, వెలుగు: ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత పైసలు వసూలు చేయడానికి సిద్ధమైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు.
వచ్చే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌లను కూడా ప్రవేశపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల తరఫున బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బీసీల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నదని, కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కులగణన సర్వేలో బీసీల సంఖ్యను తక్కువగా చూపించారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని , 10 శాతం ముస్లింలను బీసీల్లో కలిపితే బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 32 శాతమేనని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 10 జనపథ్ ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు. దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తున్నదని బండి సంజయ్ అన్నారు. . తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నదని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ విశ్యాసానికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, వెంకటరమణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి పాల్గొన్నారు.