బడ్జెట్ కేటాయింపుల విషయంలోకేంద్రం.. తెలంగాణ పట్ల చిన్న చూపు చూసినందున .. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశాభివృద్ది అంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే నిధులు కేటాయిచడమేనా అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క కలిసి ఢిల్లీకి వెళ్లి.. ప్రధానిని.. కేంద్రమంత్రులను కలిసినా పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ | తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు.. బడ్జెట్ కేటాయింపుల విషయంలో పునరాలోచించండి
తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ నేతలు కేసీఆర్.. కేటీఆర్ లు బడ్జెట్ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు మాతో కలిసి కేంద్రంపై దండయాత్ర చేయాలన్నారు. తెలంగాణ అభివృద్దికి నిధులను రాబట్టేందుకు బీజేపీ ప్రభుత్వం.. మోదీపై యుద్దం ప్రకటించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి రావలసిన వాటాను తెచ్చుకునే విషయంలో అందరం కలిసి పోరాడదామన్నారు. రాజకీయ కారణాలతో కావాలనే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని... కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టే పథకాలను చూసి ఓర్వలేక అణగదొక్కేందుకు.. బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు.
గద్దర్ విషయంలో కూడా కేంద్రం మొండి వైఖరిని అవలంభిస్తుందన్నారు. కేంద్రం దిగివచ్చి తెలంగాణకు రావలసిన నిధులు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తరుపున కేంద్రంలో మంత్రులుగా ప్రాతనిథ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.