బీజేపీ పవర్‌‌‌‌లోకొస్తే 2 లక్షల జాబ్స్​ : బండి సంజయ్

  • బీజేపీ పవర్‌‌‌‌లోకొస్తే 2 లక్షల జాబ్స్​
  • నిరుద్యోగులారా.. నిరాశపడొద్దు: బండి సంజయ్
  • కేంద్ర రిక్రూట్‌‌మెంట్లలో జరగని తప్పులు.. రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతున్నయ్?
  • నీ బిడ్డ లిక్కర్‍ దందా చేసినా, సొంత శాఖలో కొడుకు తప్పు చేసినా కాపాడుతున్నవ్
  • కేసీఆర్‍ కుటుంబానికో న్యాయం..ఇతరులకో న్యాయమా?
  • టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్‍ను బర్తరఫ్‍ చేయాల్సిందే
  • సిట్టింగ్‍ జడ్జితో విచారణ జరపాలి.. అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలి
  • వరంగల్‌‌లో ‘నిరుద్యోగ మార్చ్’.. భారీగా హాజరైన నిరుద్యోగులు, స్టూడెంట్లు

వరంగల్‍/హనుమకొండ, వెలుగు : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని బీజేపీ రాష్ట్ర ​అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నానని చెప్పారు. తమ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఉద్యోగాల నియామకాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‍ జడ్జితో విచారణ చేయించాలని, దీనికి బాధ్యుడిగా మంత్రి కేటీఆర్‍ను బర్తరఫ్‍ చేయాలని, అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‍ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్‌‌లో ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‍ నుంచి నయీంనగర్‍, పోలీస్‍ కమిషనరేట్‍, పబ్లిక్‍ గార్డెన్‍ మీదుగా అంబేద్కర్‍ జంక్షన్‍ వరకు చేపట్టిన రెండు కిలోమీటర్ల ర్యాలీలో నిరుద్యోగులు, స్టూడెంట్లు, యువత, పార్టీ శ్రేణులు వేలాదిగా పాల్గొన్నారు. సాయంత్రం 5.40కు మొదలైన ర్యాలీ 7.10కి అంబేద్కర్‍ జంక్షన్‍ వద్దకు చేరుకుంది. అక్కడ అంబేద్కర్‍ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిరుద్యోగులు, యువతను ఉద్దేశించి సంజయ్ మాట్లాడారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్‍ కుటుంబం తప్పు లేకుంటే వెంటనే సిట్టింగ్‍ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‍ చేశారు. తప్పు చేయనప్పుడు అభ్యంతరమేంటో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘నీ కొడుకును మెడలుపట్టి బయటికి గుంజుకురా.. నీ ప్రభుత్వంలో ఓ దళితుడైన డిప్యూటీ సీఎంను బయటికి పంపినవ్‍. ఈటల రాజేందర్‍ తప్పు చేయకున్నా బయటికి పంపినవ్‍. అనేక మందిని పార్టీ నుంచి, అధికారం నుంచి పంపినవ్‍. కానీ నీ బిడ్డ లిక్కర్‍ దందా చేసినా, సొంత శాఖలో కొడుకు తప్పు చేసినా కాపాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం నీ గురించి, మీ పార్టీ గురించి ఆలోచిస్తుంది’’ అని ఫైర్‍ అయ్యారు.

యువత భవిష్యత్తే ముఖ్యం

బిడ్డ లిక్కర్‍ దందా, కొడుకు కమిషన్ల దందాతో పొట్టుపొట్టు పైసలు దోచుకోవడమే వాళ్ల టార్గెట్ అని బండి సంజయ్ ఆరోపించారు. తమకు రాజకీయాలు, ప్రాణాలు ముఖ్యం కాదని.. యువత భవిష్యత్‍ ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘మమ్మల్ని అరెస్ట్ చేసినా భయపడం. కేసీఆర్‍కు బలగం లేదు. ఉన్నదల్లా కూతురు, కొడుకు, అల్లుడే. కానీ బీజేపీ బలగం అంతా మీరే. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే.. నీళ్లు పక్క రాష్ట్రాలోళ్లు దోచుకుంటే సహించాం. నిధులు దారిమళ్లిస్తే సహించినం. రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలా మార్చినా భరించినం. లక్ష 91 వేల ఉద్యోగాలున్నయ్‍.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అప్పటివరకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసంచేసిన కేసీఆర్‍ నాటకాలను 
భరిద్దామా?” అని ప్రశ్నించారు.

ఈడీ వస్తదంటే జ్వరమొస్తది.. కాలు ఇరుగుతది

‘‘ఈడీ వస్తదంటే జ్వరం వస్తది. కొవిడ్‍ వస్తది. కాలు ఇరుగుతది.. దుబాయ్‍ కూడా పోతరు” అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‍ ప్రగతి భవన్‍  దాటి బయటకు రాలేదని.. యువత ఇబ్బంది పడితే కనీసం స్పందించలేదని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం కేయూలో సునీల్‍ నాయక్‍ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్‍ చేసుకుంటే మాట్లాడలేదన్నారు. ఇంటర్ విద్యార్థులు చనిపోయినా.. ఆర్టీసీ కార్మికులు చనిపోయినా.. రైతులు చనిపోయినా, ఏండ్ల తరబడి ప్రిపేర్‍ అయిన యువత భవిష్యత్తు నాశనమైనా కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నోటిఫికేషన్ల పేరుతో టైంపాస్‍ చేస్తుండు

‘‘కేసీఆర్‍ వేసిన బిస్వాల్‍ కమిటీ రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 25 వేల ఉద్యోగాలను కేసీఆర్ రద్దు చేశాడు. ఆ లెక్కన మొత్తం 2 లక్షల 10 వేల ఉద్యోగ ఖాళీలున్నాయి. అసెంబ్లీ సాక్షిగా 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్లు, ఉప ఎన్నికలు వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి అని ప్రకటనలు చేసి యువతతో టైంపాస్‍ పాలిటిక్స్ చేస్తున్నడు” అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం రోజ్‍ గార్‍ మేళా పథకంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో తప్పులు దొర్లవు. నియామకాల్లో అక్రమాలు జరగవు. అదే రాష్ట్రానికి వచ్చేసరికి నోటిఫికేషన్లు, రిక్రూట్‍మెంట్లు, పరీక్షలు తప్పుల తడకగా ఉంటున్నాయి. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా కేసీఆర్‍ ప్రభుత్వం పనిచేస్తున్నది” అని ఆరోపించారు.‘‘బీఆర్‍ఎస్‍, కమ్యూనిస్ట్, కాంగ్రెస్‍  కార్యకర్తల్లారా.. బీజేపీ యువత కోసం కొట్లాడుతోంది. కేసీఆర్‍ కుటుంబానికి ఓ న్యాయం.? ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇంకో న్యాయమా? దీన్ని భరిద్దామా? ఒక్కసారి బీఆర్‍ఎస్‍ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి” అని కోరారు. లిక్కర్‍ దందా చేసి వందల కోట్లు పెట్టి రాజ శ్యామల యాగం చేయడానికి కాలు విరిగిందని చెప్పి రెస్ట్ తీసుకునే నీచపు బుద్ధి కల్వకుంట్ల కుటుంబానిదన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‍ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

అంబేద్కర్‍ను ముట్టుకునే అర్హత కేసీఆర్‍కు లేదు

‘‘రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఒక్కసారి పీవీ జయంతి ఉత్సవాలకు కేసీఆర్ హాజరైండు. తర్వాత ఇక ఫామ్‌హౌస్‌ దాటలేదు. అదే తరహాలోనే అంబేద్కర్‍ జయంతి ఉత్సవాలు ఉంటాయి. ఏనాడూ అంబేద్కర్‍ జయంతి, వర్ధంతిలకు హాజరు కాని, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు ఇయ్యని, దళితుడిని సీఎం చెయ్యని కేసీఆర్‍కు.. అంబేద్కర్‍ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదు” అని బండి సంజయ్‍ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‍ను స్ఫూర్తిగా తీసుకుని నడుస్తున్నదని, 12 మంది ఎస్సీ నేతలను కేంద్ర మంత్రులుగా చేసిందని చెప్పారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మియాపూర్‍ భూములు, నయీం కేసులో సిట్‍ ఏమీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీని రద్దుచేస్తే కేసీఆర్‍ కుటుంబ వ్యవహారం బయటపడుతుందనే విచారణకు సిద్ధం కావట్లేదు. కేటీఆర్‍ను బర్తరఫ్‍ చేయాలి. పేపర్ లీకేజీపై సిట్టింగ్‍ జడ్జితో విచారణ జరపాలి. అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఇచ్చేవరకు ఊరుకునేదిలేదు. నిరుద్యోగులారా..  మీ కోసం మా కుటుంబాలను పక్కనపెట్టి పోరాడుతాం. నేషన్‍ ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్’’ అని భరోసా ఇచ్చారు. భాగ్యనగర్‍ గడ్డమీద మిలియన్‍ మార్చ్​ నిర్వహిస్తామన్నారు. 30 లక్షల నిరుద్యోగులు తమ కుటుంబంతో కలిసి బీజేపీకి అండగా ఉండాలని కోరారు. నియంత కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించి రామరాజ్యం తెచ్చేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలన్నారు.

బీఆర్ఎస్ పతనానికి నాంది: లక్ష్మణ్

మిలియన్ మార్చ్ ద్వారా తెలంగాణను సాధించుకున్నట్టే.. నిరుద్యోగ మార్చ్ ద్వారా యువత ఆశయాలను నెరవేర్చుకుందామని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో లిక్కర్, లీకేజీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. నిరుద్యోగ మార్చ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందన్నారు. టీఎస్‌పీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, 30 లక్షల మంది నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిజాం షుగర్స్ లాంటి మూతపడ్డ ఫ్యాక్టరీలను పట్టించుకోకుండా.. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి తెలంగాణ సొత్తును ధారదత్తం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు హాజరయ్యారు.

దృష్టి మళ్లించేందుకే నా అరెస్టు : బండి సంజయ్​

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగుల భవిష్యత్‍ను నాశనం చేశారని, ఈ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టెన్త్ పేపర్‍ లీకేజీ అంటూ కేసీఆర్‍ తనను అరెస్ట్ చేయించారని బండి సంజయ్‍ మండిపడ్డారు. కేసీఆర్‍ ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో నిరుద్యోగికి ఇప్పటివరకు రూ.1 లక్ష 60 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉందన్నారు. ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయితే బండి సంజయ్ అంటరు. తప్పుడు నోటిఫికేషన్‍ ఇచ్చి అవి ఆగితే బండి సంజయ్ అంటరు.. టెన్త్ పేపర్‍ లీక్‍ అయితే బండి సంజయ్‍ అంటున్నరు. మరి ఇవన్నీ జరుగుతుంటే కేసీఆర్‍ ప్రభుత్వం ఏంచేస్తుందో చెప్పాలి” అని ప్రశ్నించారు. బండి సంజయ్‍, బీజేపీ కార్యకర్తలు ఉన్నది లీకులు చేయడానికి కాదని, గల్లా పట్టి బయటకు గుంజుకొచ్చి సమాధానం చెప్పించడానికి అని తెలిపారు.

అన్ని జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్!

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్​తో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో లేదా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. వాస్తవానికి 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. వరంగల్ మార్చ్​కు మంచి స్పందన రావడంతో ఈ ఆందోళనలను 33 జిల్లాలవారీగా నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. పేపర్ లీకేజీ ఇష్యూను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్ట వద్దని, 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిన ఈ ఘటనలో అసలైన దోషులకు శిక్ష పడేంతవరకు పోరాడాలన్న పట్టుదలతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న ఉమ్మడి మహబూబ్ నగర్​లో, 21న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ మార్చ్​లు జరగనున్నాయి. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో మార్చ్​లపై నిర్ణయం తీసుకోనున్నారు.