కరీంనగర్​కు 224 కోట్ల నిధులివ్వండి : బండి సంజయ్

కరీంనగర్​కు 224 కోట్ల నిధులివ్వండి : బండి సంజయ్
  • కేంద్రమంత్రి గడ్కరీకి ఎంపీ బండి సంజయ్ వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.224 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేశారు. కరీంనగర్  నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు, వంతెనల దుస్థితిని గడ్కరీకి వివరించారు.

 కేశవపట్నం నుంచి పాపయ్యపల్లె మీదుగా సైదాపూర్ వరకు 15 కి.మీల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని, కొడిమ్యాల నుంచి గోవిందారం మీదుగా తాండ్రియాల వరకు 30 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని కోరారు. చొప్పదండి మండలం అర్నకొండ నుంచి గోపాల్ రావు పేట మీదుగా మల్యాల చౌరస్తా వరకు 45 కి.మీల మేరకు, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ నుంచి సింగారం మీదుగా ముస్తాబాద్ మండలం రాంరెడ్డి పల్లె వరకు 15 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. 

గుండ్లపల్లి పోతూరు రోడ్ (కి.మీ 18/0-2), బావూపేట ఖాజీపూర్ ( కి.మీ2/0-2) వరకు మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని రిక్వెస్ట్ చేశారు. బ్రిడ్జి నిర్మాణం సహా మొత్తం 90 కి.మీల రోడ్డు విస్తరణ పనులకుగాను రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని గడ్కరీని బండి సంజయ్  కోరారు. తమ విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు బండి సంజయ్ మీడియాకు వెల్లడించారు.