కేసీఆర్ ప్రకటించిన సగం మంది అభ్యర్థులకు టికెట్ ఇవ్వరు: బండి సంజయ్

సీఎం కేసీఆర్ ప్రకటించిన సగం మంది అభ్యర్థులకు టికెట్లు ఇవ్వరని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఉంటదో.. అక్కడ అపోజిట్ వ్యక్తికి ఆర్థిక సహాయం చేస్తాడని విమర్శించారు.  చెన్నూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. అదే విధంగా రామగుండం ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ డబ్బులు పంపించారని ఆరోపించారు.ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా బయటపెట్టారని బండి సంజయ్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ తో దళితులకు ఒరిగేది ఏమీ లేదని బండి సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తు చేశారు. దళిత కుటుంబాలకు మోడీ ప్రభుత్వం అనేక ప్రోత్సాహలు అందిస్తోందని ఆయన తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం ఎన్ని హామీలిచ్చినా చివరికి అధికారంలోకి వచ్చేది మాత్రం బీజేపీ అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ బీజేపీ ఆధ్వర్యంలో మానకొండూరులో ప్రవాసి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి ఇంచార్జిలుగా వచ్చిన ఎమ్మేల్యేల ప్రచారంతో చాలా మంచి స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.