
హనుమకొండ, వెలుగు: పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది. ఈ కేసులో ఏ1 గా ఉన్న బండి సంజయ్‌తో పాటు ఏ2, ఏ3, ఏ5లకు కోర్టు ఇదివరకే బెయిల్ ఇచ్చింది. అయితే, బండి సంజయ్ బెయిల్ కండీషన్స్ పాటించడం లేదని, తన సెల్‌ఫోన్ పోలీసులకు అప్పగించకుండా విచారణకు సహకరించడం లేదని, అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమవారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జి వద్ద పిటిషన్ ఫైల్‌చేశారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో కూడా బెయిల్ రూల్స్ కు విరుద్ధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేసిన ఫోర్త్ ఎంఎం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషన్ ను కోర్టు అదే రోజు రిటర్న్ చేసింది. దీంతో మంగళవారం ఫోర్త్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేయగా.. అందులో పేర్కొన్న ప్రొవిజన్లతో కోర్టు విభేదించింది. బెయిల్ఎందుకు రద్దు చేయాలో చెప్పే సెక్షన్లను సరిగ్గా పేర్కొనలేదని పిటిషన్ రిటర్న్ చేసింది. అయితే.. పిటిషన్ లో మళ్లీ మార్పులు చేసి సబ్మిట్ చేసేందుకు సర్కారు సిద్ధమవుతుండగా, అనుకూలంగా తీర్పు రాకపోతే హై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరో ఇద్దరికి బెయిల్
టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో కోర్టు మరో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రెండు రోజుల పోలీస్ కస్టడీని ఎదుర్కొన్న ఏ6 వర్షిత్‌తో పాటు మరో నిందితుడు ఏ9 సుభాష్ కు బెయిల్ఇవ్వాలని ఫోర్త్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో డిఫెన్స్ లాయర్లు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు స్థానిక
పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకం పెట్టడంతో పాటు పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా కోరింది. కాగా, ఈ కేసులో ఏ7, ఏ8 ఇంకా రిమాండ్‌లోనే ఉన్నారు.