ప్రీతి కేసు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రీతి మృతి చెంది వారం గడుస్తున్నా..ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రీతి కేసును పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ వరంగల్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. వరంగల్ పోచమ్మ మైదాన్ నుంచి కేఎంసీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఇందులో బీజేపీ నాయకులు, విద్యార్థులు, గిరిజనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గంటకో అఘాయిత్యం, పూటకో హత్య జరుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రీతిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యేనని బండి సంజయ్ అన్నారు. నాలుగు రోజుల పాటు ప్రీతి డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిందితుడ్ని కాపాడే ప్రయత్నం చేస్తోందన్న ఆయన.. ఆధారాలు తారుమారు చేశారని ఆరోపించారు. డెడ్ బాడీలు మాయం చేసే చిల్లర రాజకీయం ఈ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రీతి మృతి కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాష్ట్రంలో హోంమంత్రి అసలు ఉన్నాడా..లేడా అని ప్రశ్నించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపడుతానని బండి సంజయ్ ప్రకటించారు.