రాజన్నసిరిసిల్ల/గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసు కుంటడా? అని బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్సవాల్ విసిరారు. ‘‘గురువారం కరీంనగర్ లో కేసీ ఆర్ నాపై అడ్డ గోలు కామెంట్లు చేశారు. 8శాతం ఓట్లతో వినోద్ గెలుస్తుండని చెప్పిండు. ముస్లింలందరూ ఏకమై బండి సంజయ్ ని ఓడించాలన్నడు. నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి”అని సంజయ్ ఆరోపించారు.
శుక్రవారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ... కేసీఆర్ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారని, దీన్ని తెలంగాణ సమాజం, కరీంనగర్ లోని హిందూ సమాజం గుర్తించాలన్నారు. ముస్లిం ఓట్ల తో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే తాను హిందుత్వాన్ని వదిలేస్తానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే కేసిఆర్ ముస్లిం మతాన్ని స్వీకరించాలని సూచించారు. కేసీఆర్ కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలపై హిందు సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. పేదవాడినైనా నేను కావాలో కేసీఆర్ చుట్టాలు వినోద్, రాజేందర్ రావు కావాలో మీరే తేల్చాలన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ లీడర్లు గాడిద గుడ్డు చూయించి ప్రచారం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
నేతన్నలకు బీఆర్ఎస్ చేసిందేమీలేదు
సిరిసిల్ల నేతన్నల బతుకులను బీఆర్ఎస్ ఆగం చేసిందని, బతుకమ్మ చీరలతో వారికి బతుకులేకుండా చేసిందని దుయ్యబట్టారు. రూ.270 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలతో నేతన్న బతుకులను నాశనం చేశారన్నారు. తాను దీక్ష చేస్తానంటేనే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేసిందన్నారు. సిరిసిల్ల కు కేటీఆర్ చేసిందేమీలేదన్నారు. గాలి మాటలతో పదేండ్లు కాలయాపన చేశారన్నారు. సర్జికల్ స్ట్రైక్ పై అనుమానాలున్నాయంటున్న కేసీఆర్.. దేశాన్ని కాపలాకాసే జవాన్‌ను అడగాలన్నారు. కేసీఆర్ ఏ దేశం మనిషో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.