- దొరికాయన్న 15 కోట్లు ఏమైనయ్.. కేసీఆర్‌ను ప్రశ్నించిన బండి సంజయ్
- అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ లా ఆడియో
- కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులే దొంగలు
- నిందితుడు నందుతో వారికి సంబంధాలున్నయ్
- ఆ స్వామీజీలెవరో మాకు తెల్వదుఎమ్మెల్యేల కొనుగోలులో
- బీజేపీకి ప్రమేయం లేదంటూ యాదగిరిగుట్ట ఆలయంలో తడిబట్టలతో సంజయ్ ప్రమాణం
యాదాద్రి, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ సంభాషణలు అంటూ లీక్ చేసిన ఆడియో టేప్‌లను కోర్టుకు ఎందుకియ్యలేదని బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే దొంగలు.. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు అర్థమైంది. అందుకే ఈ డ్రామా. శుక్రవారం లీక్ చేసిన ఆడియోలు అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయి. అవి నిజమైనవే అయితే స్వయంగా కేసీఆర్ రిలీజ్ చేయొచ్చు కదా? ఈ లీకులెందుకు?’’ అని నిలదీశారు. గురువారం సంజయ్ యాదగిరిగుట్టలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చారు. తడిబట్టలతో స్వామి వారి ఆలయం గర్భగుడిలోకి వెళ్లి ‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదు’ అని ప్రమాణం చేశారు. అనంతరం కొండ కింద స్వామి వారి పాదాల వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో పావులైన నలుగురు ఎమ్మెల్యేలను బయటకు రాకుండా ప్రగతిభవన్‌లో బంధించారని ఆరోపించారు. ఈ డ్రామా వెనక కేసీఆర్ లేకుంటే లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తప్పు లేనప్పుడు ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ స్కామ్ బయటపడినప్పుడు కేసీఆర్ ఏజెంట్ అయిన పోలీస్ కమిషనర్ రూ.100 కోట్ల డీల్అని అందులో రూ.15 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ సొమ్ము ఏమైందని, ఏసీబీ కోర్టులో ఎందుకు సమర్పించలేదని అడిగారు. ఆడియో రికార్డుల తయారీకి 3 రోజుల టైం పట్టిందని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంలో ఏ-1 కేసీఆర్ అయితే ఏ2 కేటీఆర్ అని ఆరోపించారు.
బీజేపీపై బురదజల్లే ఎత్తుగడ
‘చిత్తయిన డ్రామాను రక్తికట్టించాలని ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారు. అవి నిజమైనవే అయితే కేసీఆర్ ఎందుకు రిలీజ్ చేయలేదు?’’ అని సంజయ్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మునుగోడులో మందు, మాంసం, ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓడిపోతామని తేలడంతో బీజేపీ మీద బురద చల్లడానికి సీఎం కేసీఆర్ ఈ డ్రామకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో దొరికిన స్వామీజీలు ఎవరో తమకు తెలియదన్నారు. దొరికిన వారిలో నందు అనే వ్యక్తితో సీఎం కుటుంబానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘మేం ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నాం కాబట్టే విచారణ జరిపించాలని హైకోర్టును కోరాం. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. కేసీఆర్ చేసిన తప్పులు, దోచుకొని దాచుకున్న పాపం ఊరికే పోదు. త్వరలోనే వారి కుటుంబం రాజకీయంగా సమాధి కాబోతోంది”అని హెచ్చరించారు. సంజయ్ వెంట పార్టీ నేతలు గంగిడి మనోహర్ రెడ్డి, పీవీ శ్యాంసుందర్ రావు, వీరేందర్ గౌడ్, జె సంగప్ప ఉన్నారు.
సంజయ్‌ను కలిసిన ఎస్ఐ.. కానిస్టేబుల్ అభ్యర్థులు
ప్రశ్నలు తప్పుగా ఇచ్చి మార్కులు కలపలేదని, దీనివల్ల తాము ఫెయిల్ అయ్యామంటూ యాదగిరిగుట్ట వచ్చిన సంజయ్‌కు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. ఫెయిలయ్యామన్న ఆవేదనలో నలుగురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అభ్యర్థులకు న్యాయం చేయాలని కేసీఆర్‌కు లేఖ రాస్తానని సంజయ్ వారితో చెప్పారు.
బండి పర్యటన ఉత్కంఠ
టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలు, పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం మధ్య సంజయ్ పర్యటన మర్రిగూడ నుంచి యాదగిరిగుట్టకు 80 కి.మీ. ప్రయాణం 4 గంటల పాటు ఉత్కంఠగాసాగింది. గురువారం పొద్దున 10.30 గంటలకు సంజయ్ మర్రిగూడలో బయలు దేరారు. సంజయ్ యాత్రను అడ్డుకుంటామన్న టీఆర్ఎస్ కార్యకర్తలు చౌటుప్పల్‌లో ఆటో డ్రైవర్లతో నిరసన చేపట్టారు. ఆలేరు కార్యకర్తలు యాదగిరిగుట్టలో బీజేపీ ప్లెక్సీలను దహనం చేశారు. సంజయ్ తన కాన్వాయ్‌ను పలుచోట్ల ఆపుతూ ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో దివ్యాంగుడైన కమ్యూనిస్టు కార్యకర్త కాశయ్యను కలిశారు.