
- సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
- గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పైసలన్నీ కేంద్రానివేనని కామెంట్
కరీంనగర్, వెలుగు: రేషన్ బియ్యం కోసం కేంద్రం ఇస్తున్న పైసలు అక్కర్లేదని కేంద్రానికి లేఖ రాసే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో పెట్టాలని తాము కోరుతున్నామని, పేదలకు అందిస్తున్న బియ్యంలో కేంద్రం వాటా ఉందని కూడా ప్రజలకు చెప్పాలని అడుగుతున్నామన్నారు. బీజేపీ చేపట్టిన ‘గావ్ చలో’ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్‌లో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు 4 కోట్ల ఇండ్లను నిర్మించిందని, మరో 3 కోట్ల ఇండ్లను నిర్మించేందుకు సిద్ధమైందని తెలిపారు. కానీ, తెలంగాణలో ఇక్కడి పాలకులు 11 ఏండ్లుగా పేదలకు ఇండ్లు నిర్మించకుండా.. వాళ్లకు గూడు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కేంద్రం 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే.. ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. రేషన్ బియ్యానికి అయ్యే ఖర్చులో కిలోకు రూ.10 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, మోదీ ప్రభుత్వం కిలోకు రూ.37 ఇస్తోందని తెలిపారు.
అంబేద్కర్ చరిత్రను తగ్గించేందుకు కుట్ర..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పరిఢవిల్లేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబైకి తరలించారని, అందుకయ్యే విమాన చార్జీలు చెల్లించాలంటూ ఆయన సతీమణికి బిల్లులు పంపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.
అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియం నుంచి కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం కోర్టు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ చరిత్రను తగ్గించే కుట్ర చేసిందని, భారతరత్న ఇవ్వకుండా అవమానించిందని ఆయన విమర్శించారు.