కేసీఆర్..శివాలయం వద్ద ప్రమాణానికి వస్తావా?

  • ప్రజల కోసం పనిచేస్తే హీరోలు కావాలా..పీడించే విలన్లు కావాలా?
  • గ్రూప్–1 పరీక్ష సరిగ్గా నిర్వహిచలేని అసమర్థ పాలకులు కావాలా?
  • రోడ్ షోలో జీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండీ సంజయ్ కుమార్

సంస్థాన్ నారాయణపురం వెలుగు : ‘గొర్రెల డబ్బులు ఇవ్వొద్దు అంటూ నేను ఈసీకి లెటర్​రాశానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. నేను లెటర్​రాసినట్టు నిరూపిస్తావా? ప్రమాణం చేయడానికి నేను నా కుటుంబంతో శివాలయానికి వస్తా. నీ కుటుంబంతో నువ్వు రావడానికి సిద్ధమేనా?’ అంటూ  సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కుమార్​ సవాల్ విసిరారు. శుక్రవారం సాయంత్రం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలోని శివాలయం నుంచి రామాలయం వరకు జరిగిన రోడ్ షోలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మునుగోడు ప్రజలారా..తెలంగాణ ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ రాక్షస పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారా? గొంతు పిసికి సంపుకుంటారా? గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్థ, అక్రమ పాలకులు కావాలా? నిజాయితీగా పనిచేస్తున్న మోడీ పాలన కావాలా? చెప్పండి’ అని అన్నారు. హైదరాబాద్​లోని హయత్ నగర్ లో కాక్ టైల్ పార్టీ పెట్టారని, అందులో మంత్రులు పాల్గొని డ్యాన్సులు చేస్తున్నారన్నారు. ట్విట్టర్​ (కేటీఆర్ ను ఉద్దేశించి) ఇప్పుడే చౌటుప్పల్ కి వచ్చాడని, తాము వస్తుంటే టీఆర్ఎస్ వాళ్లు తమతో చేతులు కలపడానికి ఎగబడ్డారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హీరో లెక్క ఉన్నడని, ప్రజల కోసం పనిచేసే హీరోలు కావాలో ప్రజలను పీడించే విలన్లు కావాలో మునుగోడు ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. క్యారెక్టర్, కెపాసిటీ లేని వ్యక్తులను గెలిపించవద్దన్నారు. సంస్థాన్ నారాయణపురం శివాలయానికి కేసీఆర్ ను తీసుకువస్తే ఆ శివుడి సాక్షిగా కేసీఆర్ చెప్పిన అబద్దాలు నిరూపిస్తానన్నారు. 

అందుకే..రాజీనామా చేసిండు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడని కొందరు మూర్ఖులు ప్రశ్నిస్తున్నారని సంజయ్​అన్నారు. రాచకొండ గుట్టల్లో కేసీఆర్ ఫిలిం సిటీ కడతానని చెప్పాడని, అది చేయకపోగా ఢిల్లీలో ఫారెస్ట్ అధికారులను కలిసి భూములు గుంజుకున్నాడని, దానిపై ప్రశ్నించేందుకు సీఎంను సమయం అడగగా ఇవ్వనందుకే రాజీనామా చేశాడన్నారు. పోడు భూముల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని, చర్లగూడెం రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేదని, కమీషన్లకు కక్కుర్తిపడి దోచుకుంటున్నారని..చేనేతలకు నూలు, రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించేందుకు టైం అడగ్గా ముఖ్యమంత్రి ఇవ్వకపోవడంతోనే రిజైన్​చేశారన్నారు. పుట్టపాకలో జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలున్నా వారి సమస్యల గురించి మాట్లాడడానికి సమయం ఇవ్వడం లేదని..ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యలు పరిష్కరించడం లేదని అడిగేందుకు అపాయింట్​మెంట్​ఇవ్వకపోవడంతోనే అలా చేశాడన్నారు. ఆయన రాజీనామా చేశాకే చౌటుప్పల్ నుంచి నారాయణపురం వరకు రోడ్డు పూర్తయిందని, గట్టుప్పల్​మండలమైందని, పెన్షన్లు వస్తున్నాయన్నారు. అక్కడక్కడా మొరిగే కుక్కలకు ఈ సమాధానం ఇస్తున్నానన్నారు. 

పోలీసుల్లారా మీకు విజ్ఞప్తి...

‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగే ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఒత్తిడికి గురి చేసి బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఆలోచించి పోలీసు సిబ్బంది పని చేయాలి’ అని అన్నారు. పోలీసులకు రావాల్సిన డీఏ, టీఏ,అలవెన్సులు, ప్రమోషన్లు రాలేదని, వీటిపై ఏనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడలేదని, అందుకే మునుగోడు ఎన్నికల్లో పోలీసులు తమ దమ్మును చూపాలన్నారు. తెలంగాణలో నక్సలైట్లు వచ్చినా, ఉగ్రవాదులు వచ్చినా పోలీసులకు అండగా ఉండేది కాషాయం జెండా మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గుర్రంపోడులో బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారని అనేక సందర్భాల్లో వివేక్ వెంకటస్వామి, రఘునందన్, రమేశ్​రాథోడ్​లతో పాటు తనను కూడా ఎన్నోసార్లు పోలీసులు అరెస్టు చేశారని, ఏనాడు తాము కేసులకు భయపడలేదన్నారు. కార్యకర్తలు కూడా భయపడవద్దని, తామంతా అండగా ఉంటామన్నారు. ‘మునుగోడులో టీఆర్ఎస్ లీడర్లు ఓటుకు రూ.40 వేలు ఇస్తున్నరు. ఆ డబ్బును తీసుకోండి. బీజేపీకి ఓటెయ్యండి. హుజూరాబాద్, దుబ్బాకలో అక్కడ జనాలు ఇట్లనే చేసిండ్రు’ అని అన్నారు. గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం ఫెయిలయ్యిందని, ఏండ్ల తరబడి కష్టపడి కూలీనాలీ డబ్బులతో కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే సరిగ్గా నిర్వహించలేని మూర్ఖుడు కేసీఆర్ అని మండిపడ్డారు. బాలికలపై రేప్ జరిగినా, ఆత్మహత్య చేసుకున్నా స్పందించని దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో 34 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ తల్లి రోదిస్తోంది. గడీల పాలన నుంచి విముక్తి కల్పించాలని ఏడుస్తోంది స్పందించండి. ప్రతి ఒక్కరూ గడపగడపకూ తిరగండి. టీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు పువ్వు గుర్తుకు ఓటేయించండి’ అని  పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 6వ తేదీనే మనకు అసలైన దీపావళి పండుగ అని అన్నారు.

కేసీఆర్​ ఖేల్ ఖతం దుకాణం బంద్

తాను మునుగోడులో గెలిస్తే కేసీఆర్​ఖేల్ ఖతం దుకాణం బంద్ అయితదని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను మాట్లాడడానికి ఏమీ లేదని  ఏది చేసినా చేతల్లోనే చేసి చూపిస్తానన్నారు. బీజేపీ అంటే ఒక యుద్ధ నౌక అని అన్నారు. నారాయణపూర్ లో ఇండ్లు వచ్చాయా? రోడ్లు వచ్చాయా? ఎవరికోసం వచ్చింది తెలంగాణ అని ప్రశ్నించారు.కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రఘునందన్, వివేక్ వెంకటస్వామి, బండి సంజయ్ పోరాడుతున్నారని, ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ కూడా ఆ పోరాటానికి మద్దతుగా వచ్చారన్నారు. తనను ఓడించడం కోసం ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలకు వాళ్ల నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ దగ్గర నిధులు తీసుకొచ్చే దమ్ముందా అని నిలదీశారు. రోడ్ షోలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, రమేశ్​రాథోడ్, బూర నర్సయ్య గౌడ్, గంగిడి మనోహర్ రెడ్డి, విఠల్ ఉన్నారు.