అధికారం పోయినా కేటీఆర్​ అహంకారం తగ్గలే : బండి సంజయ్

  • నేను తెచ్చిన నిధులపై కేసీఆర్​తో చర్చకు రెడీ
  • ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న దగ్గరికి తీసుకు రా..
  • కేటీఆర్​కు సంజయ్ సవాల్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎంపీగా కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ‘‘నేను చేసిన అభివృద్ధి.. తెచ్చిన నిధులపై కేసీఆర్​తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్న. నీకు దమ్ముంటే ఎములాడ రాజన్న దగ్గరకో.. కొండగట్టు అంజన్న దగ్గరకో తీసుకు రా..’’ అని కేటీఆర్​కు సంజయ్ సవాల్ విసిరారు.

ప్రజలు ఓడించినా కేటీఆర్​లో అహంకారం తగ్గలేదన్నారు. తాను తెచ్చిన నిధులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. చేసిన అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని చూపిస్తూ.. ‘‘నేను ఎన్ని ఫండ్స్ తెచ్చానో కొన్నింటిని పుస్తకంలో ప్రస్తావించాను. ముందు చదువుకో.. తర్వాత దమ్ముంటే నువ్వు.. నీ అయ్యని చర్చకు తీసుకొనిరా.. లెక్కలు చెప్తా’’అని ఫైర్ అయ్యారు. బుధవారం కరీంనగర్ లోని అశోక్ నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ సర్వనాశనమైంది. నువ్వు ఎంత మొరిగినా కరీంనగర్ లో బీఆర్ఎస్​కు డిపాజిట్ రాదు. మీ పార్టీది మూడో ప్లేస్’’ అని సంజయ్ విమర్శించారు. 

అందుకే బీఆర్ఎస్​ను బొంద పెట్టిన్రు

ఇంకా అధికారంలోనే ఉన్నట్టు కేటీఆర్ భావిస్తున్నాడని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలోని అరాచకాలు, అవినీతి బయటపెట్టిందే బీజేపీ అని అన్నారు. అందుకే జనం బీఆర్ఎస్​ను బొందపెట్టారన్నారు. అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడని ఫైర్ అయ్యారు. ‘‘నువ్వెంత మొరిగినా.. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి అయిన వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్పా.. ఒక్క పనీ చేయలే.. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం బాగా ఉపయోగపడిండు’’అని సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ – జగిత్యాల, కరీంనగర్ –వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చింది ఎవరు అని ప్రశ్నించారు.

నిధులు మళ్లించిన మూర్ఖులు మీరు..

‘‘కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ నిధులు నేను తెచ్చిన. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తెచ్చింది నేనే కదా? శాతవాహన వర్సిటీకి అటానమస్ హోదా, ఎస్సారార్ కాలేజీకి 12బీ హోదా తెచ్చిందెవరు? నేనే కదా. మీ అయ్య తెచ్చిండు అనుకున్నవా?’’అని కేటీఆర్​పై మండిపడ్డారు. 2015లో కరీంనగర్ ను స్మార్ట్ సిటీ కింద గుర్తించి రూ.196 కోట్లు మంజూరు చేస్తే.. వాటిని మళ్లించిన మూర్ఖులు బీఆర్ఎస్ నేతలు అని ధ్వజమెత్తారు.  గుడికి, బడికి సంజయ్ పైసలిచ్చిండా? అని వాగుతున్నవ్. సిగ్గుండాలే.. విద్య, దేవాలయాలు రాష్ట్రం పరిధిలో ఉన్నాయా? కేంద్రం పరిధిలో ఉన్నాయా?  నేను ఏం చేశానో ప్రజలకు తెలుసు’’అని కేటీఆర్​పై సంజయ్ ఫైర్ అయ్యారు. 

ఎములాడకు ఇస్తానన్న నిధులేవి?

‘‘వేములవాడలోనే మీ అయ్య పెండ్లి చేసుకున్నడు.. ఏటా వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తా అన్నడు. కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు రూ.100 కోట్ల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చిండు.. ఎందుకియ్యలేదు?’’అని కేటీఆర్​ను సంజయ్ ప్రశ్నించారు. యాదగిరిగుట్టను కమర్షియల్​గా మార్చిన నాస్తికుడు కేటీఆర్ అని మండిపడ్డారు. కేటీఆర్​తో పాటు వినోద్ కూడా నాస్తికుడేనని విమర్శించారు. ‘‘నీ లెక్క నేను ప్యారాచూట్ లీడర్​ను కాదు. అయ్య పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు’’అని సంజయ్ మండిపడ్డారు.

సర్పంచ్​ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయండి

  • సీఎం రేవంత్ రెడ్డికి సంజయ్ లేఖ

హైదరాబాద్, వెలుగు: సర్పంచ్​ల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సర్పంచ్​లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1,850 కోట్ల వరకు ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. స్థానిక సంస్థలను కేసీఆర్ నాశనం చేశాడని విమర్శించారు.

సర్పంచ్​లు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో 65 మంది సర్పంచ్​లు మరణించారని పేర్కొన్నారు. మరో వారంలో సర్పంచ్​ల పదవి కాలం ముగియనుందని వివరించారు. పెండింగ్ బిల్లులపై సర్పంచ్ లు ఆందోళన చెందుతున్నారని, అందువల్ల సీఎం వారితో భేటీ కావాలని కోరారు.  మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని లేఖలో బండి సంజయ్​ కోరారు.