రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది... గెలిచేది బీజేపీనే : బండి సంజయ్

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ , టీడీపీకి అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారని చెప్పారు.   ఖమ్మంలో 2023 జూన్ 09 శుక్రవారం ఏర్పాటు చేసిన బీజేపీ సన్నాహక  సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారని,  జిల్లా ప్రజలకు భరోసా కల్పించేందుకే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఈనెల 15న సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.  సభకు భారీగా తరలివచ్చి భాజపా బలమేంటో ఇక్కడి కార్యకర్తలు చూపాలన్నారు.  

అమిత్ షా మీటింగ్ సక్సెస్ అయితే కొత్తగూడెనికి ప్రధాని మోడీ వస్తారని బండి సంజయ్ చెప్పారు.  రాష్ట్రంలోని119 నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని అన్నారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని చెప్పిన సంజయ్.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. 

బీజేపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తుందన్న సంజయ్.. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను రెండు సార్లు జైలుకు వెళ్లానని  అన్నారు.  ఖమ్మంలో బీఆర్ఎస్  నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని బండి సంజయ్ అన్నారు.  

 కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో ఉత్సవాలు చేసేందుకు కార్యకర్తలు , నాయకులు లేరని, బీజేపీ ఎమ్మెల్సీ గెలిస్తే  ప్రతి మండలంలో ఉత్సవాలు చేసారని తెలిపారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టి లేపినా లేవలేని స్థితిలో ఉందని విమర్శించారు.