కొత్తపల్లి, వెలుగు : అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ వందసార్లకు పైగా మార్చి అవమానించిందని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కొత్తపల్లి మున్సిపల్ ఏరియాలోని మార్కెట్లో శనివారం రాత్రి నిర్వహించిన స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కొంటోందని ఆరోపించారు. కేసీఆర్ దేవుడి తీర్థ ప్రసాదాలు, అక్షింతలను హేళన చేస్తున్నారని మండిపడ్డారు. తాను కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు తీసుకొచ్చానని చెప్పారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని రిపోర్టులు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి బెంబేలెత్తిపోయి పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని, మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రకటించిన తర్వాత కూడా విషం చిమ్ముతున్నారని చెప్పారు. ఆయన వెంట ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ తదితరులు ఉన్నారు.