- బీజేపీకి, కవిత బెయిల్‌కు సంబంధమే లేదు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత కవితకు కాంగ్రెస్ పార్టీనే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీయే కవిత బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని, అందుకోసమే ఆయనను తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయించారని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని రావిరాలలో మంగళవారం నిర్వహించిన సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో సంజయ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని విమర్శించారు. ‘‘కేసీఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభుత్వంలో మంత్రిపదవులు ఇస్తున్నారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫాంహౌజ్ కు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ నేతలే కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు” అని సంజయ్ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదు” అని సంజయ్ చెప్పారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, స్థానిక నేతలు ఉన్నారు.