- మాట ముచ్చటతోపాటు కప్పం కూడా కట్టినట్లున్నడు: సంజయ్
- ముహూర్తం చూసుకుని విలీనమే తరువాయి
- రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చెల్లించాల్సిన కప్పం కట్టేసిండు. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ సహా కేసీఆర్ కుటుంబంపై ఉన్న అవినీతి కేసులన్నింటినీ అటకెక్కించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తానన్న వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు” అని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ మాటముచ్చట కూడా పూర్తి చేసినట్లు సమాచారం ఉందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని విలీనం కావడమే మిగిలిందన్నారు. సోమవారం కరీంనగర్ లోని తన నివాసంలో జరిగిన రక్షాబంధన్ వేడుకల సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. హిందువులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటో, వీడియో జర్నలిస్టులకు గ్రీటింగ్స్ తెలియజేశారు.
ఫొటో, వీడియో జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు పడతారని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం గోదావరిఖనిలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ ఇంటికి వెళ్లిన సందర్భంగా కూడా సంజయ్ మాట్లాడారు. రుణమాఫీపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతన లేదని సంజయ్ విమర్శించారు. రూ. 40 వేల కోట్ల మాఫీ అని.. రూ. 17 వేల కోట్లతోనే సరిపెట్టారన్నారు.
రైతు భరోసా, విద్యా భరోసా, మహాలక్ష్మి వంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము ప్రశ్నిస్తున్నందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ను వీలీనం చేసుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు.