- అడ్డగోలుగా తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లే
- దీని వెనుక ఆంతర్యమేంటో సీఎం రేవంత్ చెప్పాలి: బండి సంజయ్
- కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసువ్యవహారమే
- డగ్స్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లోనూ హడావుడి చేసి వదిలేశారని విమర్శ
కరీంనగర్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్ కేసు సహా అనేక అవినీతి ఆరోపణలున్నా.. కేటీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దీని వెనుక ఆంతర్యమేంటో సీఎం రేవంత్ చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. ‘‘సీఎంను పట్టుకొని.. లొట్టపీసు సీఎం, చిట్టినాయుడు, సన్నాసి అని అడ్డగోలుగా తిడుతున్నా.. రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఒక్కటేనా? ఈ పరిణామాలతో వాళ్ల మధ్య ఏదైనా లోపాయికారీ ఒప్పందం జరిగిందా అనే అనుమానం వస్తోంది”అని సంజయ్అన్నారు.
శుక్రవారం కరీంనగర్ రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ కొడుకేమైనా దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడా? ఆయన జైలుకు వెళితే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గొడవ చేస్తరు? కేబినెట్ అనుమతి లేకుండా సర్కార్ సొమ్మును అప్పనంగా విడుదల చేయాల్సిన అవసరమేముంది?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని ఆరోపించారు. తప్పుచేసి కప్పి పుచ్చుకోవడానికే రూ.700 కోట్ల లాభం వచ్చినట్టు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
దమ్ముంటే ఆ లాభం ఎట్లా వచ్చిందో లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. సర్కార్ సొమ్మును అక్రమంగా కట్టబెట్టి అడ్డగోలుగా మాట్లాడుతవా? అని ధ్వజమెత్తారు. కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమేనని పేర్కొన్నారు. ఎందుకంటే కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్ కేసులో డ్రగ్స్‌తో దొరికినా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, ధరణి భూముల వ్యవహారంపైనా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారని సంజయ్ మండిపడ్డారు.
తిరుమల ఘటన దురదృష్టకరం..
తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని సంజయ్అన్నారు. ఘటన కారణాలపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు