ఒవైసీకి ఓ న్యాయం..ఇతరులకు ఓ న్యాయమా?

ఒవైసీకి ఓ న్యాయం..ఇతరులకు ఓ న్యాయమా?

 

  • చెరువులో బిల్డింగ్ కడ్తే ఎందుకు కూలుస్తలే?: బండి సంజయ్ 
  • బీఆర్ఎస్ అరాచకాలు మరువలేం.. ఆ పార్టీ అంతు చూస్తం
  • బీజేపీలో బీఆర్​ఎస్​ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు:  మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సల్కం చెరువును ఆక్రమించి బిల్డింగులు కట్టి విద్యాసంస్థలను నడుపుతున్నారని, ఆ బిల్డింగులను ఎందుకు కూల్చివేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘ఒవైసీ చెరువులో బిల్డింగులు కట్టి.. పేద విద్యార్థుల పేరుతో పొట్టుపొట్టుగ పైసలు సంపాయిస్తుండు. ఒవైసీ విద్యాసంస్థల విషయంలో ఒక విధానం, మిగతా వర్సిటీల విషయంలో ఇంకో విధానం ఎలా అనుసరిస్తారు? ఇందులో కూడా మైనార్టీ సంతుష్టీకరణ విధానమేనా? ఒవైసీ బెదిరిస్తే కాంగ్రెస్ సర్కారు భయపడుతున్నది. అందుకే చర్యలు తీసుకోవట్లేదు” అని ఫైర్ అయ్యారు. 


హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని నాగోల్ లో శుక్రవారం బీజేపీ అనుబంధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. రుణమాఫీ అంశం నుంచి దారి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా దాడులు, విగ్రహాల లొల్లి, రుణమాఫీ సర్వే పేరుతో డ్రామాలు ఆడుతోందన్నారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని.. కానీ పేదోళ్లకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోమన్నారు. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ వీలీనమంటూ కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తోందని, బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని చెప్పారు. ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ సర్కారు ఎస్టీలపై, బీజేపీ నేతలు, కార్యకర్తలపై చేసిన అరాచకాలు ఇంకా తన కండ్ల ముందు మెదులుతున్నాయని చెప్పారు.   

కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం.. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ విలీనం మాట ముచ్చట పూర్తయిందని, అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని బండి సంజయ్ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో 38 మంది ఎమ్మెల్యేలున్నా బీఆర్ఎస్ ఎందుకు నామినేషన్ వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తో కలిసి పని చేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని, బీఆర్ఎస్ తో బీజేపీ కార్యకర్తలు కొట్లాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో 77 లక్షల ఓట్లు వచ్చాయని, వారందరినీ బీజేపీ సభ్యులుగా చేర్పించేందుకు ప్రయత్నించాలని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలో లక్ష మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించాలని, ఓల్డ్ సిటీని న్యూసిటీగా మారుద్దామని పిలుపునిచ్చారు. ఒక్కో మోర్చాకు నిర్దేశించిన సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించినోళ్లకు ప్రధాని మోదీతో సన్మానం చేయిస్తానని హామీనిచ్చారు.   

సుప్రీం తీర్పుకు, బీజేపీకి ముడిపెడ్తరా?: లక్ష్మణ్ 

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖమ్మం, నల్లగొండ ప్రాంతాలతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో అన్ని వర్గాల నుంచి సభ్యత్వం పెంచాలని కోరారు. 
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే.. సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పునకు, బీజేపీకి ముడిపెట్టడం సిగ్గుచేటన్నారు.