ఇది టీఆర్ఎస్ గెలుపు కాదు: బండి సంజయ్

  • ఇది టీఆర్ఎస్ గెలుపు కాదు
  • పోలీసులు, ఎన్నికల అధికారులది: సంజయ్
  • వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.. డబ్బు, మద్యం కుమ్మరించారు
  • అడుగడుగునా అధికార దుర్వినియోగం 
  • 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తవా?
  • ఇచ్చిన హామీలు 15  రోజుల్లో అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు టీఆర్ఎస్ ది కాదని.. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల అధికారుల గెలుపని బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. పోలీసులు, ఈసీ అధికారుల సపోర్టుతోనే అడ్డదారుల్లో  టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు మద్యం పోసినా, డబ్బు పంచినా.. వాళ్లపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. అంబులెన్స్ లు, ప్రభుత్వ వాహనాల్లో డబ్బులు తరలించారని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార పార్టీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని, అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో కలిసి సంజయ్ పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓడిపోతే తాము నిరాశపడబోమని, పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పని చేస్తామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఓ మంచి ఆలోచనతో రాజీనామా చేసి బరిలో నిలిచారని, మునుగోడులో  ఓ హీరో లెక్క యుద్ధం చేశారని పేర్కొన్నారు. ‘‘ప్రచారంలో మాపై గూండాలు దాడులు చేసినా వెనుకకు పోలేదు. లాఠీ చార్జీలు, బెదిరింపులకు మా పార్టీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదు. నాయకులు సమష్టిగా పని చేసి 87 వేల ఓట్లు బీజేపీకి వచ్చేలా కృషి చేశారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేసే సమయం ఇది కాదు. టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు” అని అన్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ 15 రోజుల్లో నెరవేర్చాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ను ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా వారు అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కటి గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారని కేటీఆర్ పై ఆయన మండిపడ్డారు. 

ఆ 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తరా?

మేము పార్టీలో చేర్చుకోవాలంటే పదవికి రాజీనామా చేయాలనే సిద్ధాంతం తీసుకున్నామని, తమ పార్టీ ఇదే ఫాలో అవుతున్నదని సంజయ్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ కు దమ్ము ఉంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరిన 12 మందితో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారని ఫైర్ అయ్యారు. అసలు మునుగోడులో గెలుపు అయ్యదా, కొడుకుదా, బావదా, బామర్దిదా, కమ్యూనిస్టులదా అని ఎద్దేవా చేశారు. ‘‘టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కు కూడా పైసలిచ్చిన్రు. బీజేపీని లేపకుండా చూసేందుకు కాంగ్రెస్ ను లేపిన్రు. ప్రభుత్వ ఓట్లను చీల్చిన్రు. అంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు పని చేసినా కేవలం10 వేల మెజార్టీతోనే గెలిచిన్రు. ఈ ఓటమిపై సమీక్ష చేసుకుంటం. ఎక్కడెక్కడ తక్కువ ఓట్లు వచ్చాయో చూసుకుంటం. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఎన్నికతో రుజువైంది” అని సంజయ్ అన్నారు.