- ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తం.. ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం
- కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో 2028లో గెలిచేది బీజేపీయేనని, తాము అధికారంలోకి రాగానే పాతబస్తీని ప్రక్షాళన చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాతబస్తీని స్వాధీనం చేసుకొని, ఎంఐఎం ఆనవాళ్లే లేకుండా చేస్తామన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అయిందని, హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ను జనాలు తిడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ కొట్లాడితే.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి ఫోర్త్ సిటీ, జూ, హెల్త్ హబ్ అని చెబుతున్నారు.. ఉన్న జాగలన్నీ కేసీఆరే అమ్ముకుంటే ఇంకా స్థలం ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం ప్రజలు రోడ్డెక్కుతుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు రాగానే ప్రజల్లో తిరుగుతా అని అంటున్న కేసీఆర్ ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు.
కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన నేతకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఇస్తే, ఆయనపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కావడం పక్కా అని చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పాల్గొన్నారు.