రోడ్డెక్కడం సరికాదు..రాజాసింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

రోడ్డెక్కడం సరికాదు..రాజాసింగ్  పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

 

  • మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం 
  • ముస్లింలను బీసీల్లో చేర్చితే  ఆమోదించం అని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు:  ఒక్క కులానికే బీజేపీలో పదవులు ఇచ్చారని అనడం కరెక్ట్ కాదని బండి సంజయ్ అన్నారు. ‘‘బీసీని సీఎం చేస్తామని గత ఎన్నికల్లో బీజేపీ ప్రకటించింది. బీసీనైన నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. మరో బీసీ లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపడంతో పాటు పార్లమెంటరీ బోర్డు పదవి ఇచ్చింది. బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది కాబబ్టే ఓసీ అయిన కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది” అని తెలిపారు. 

‘‘పార్టీ నియమనిబంధనల ప్రకారం పదవులు ఇస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. అంతేగానీ రోడ్డుకు ఎక్కడం సరికాదు. రాజాసింగ్ కు ఇబ్బందులుండొచ్చు.. బాధ ఉండొచ్చు. ఆయన కమిట్ మెంట్ ఉన్న నాయకుడు. హిందుత్వవాది. చాలా మంచి వ్యక్తి. అనేక రకాలుగా ధర్మం కోసం పోరాడుతూ ఇబ్బంది పడ్డారు. ఆయన మావాడు.. ఆయనతో నిన్న మాట్లాడిన. ఇకపైనా మాట్లాడతా. ఎందుకంటే మా పార్టీ నాయకుడు” అని చెప్పారు.

రాహుల్ ది ఏ కులం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం? ఏ మతం? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ, రాహుల్ కులంపై చర్చకు తాము సిద్ధమని.. ఇదే అంశం రెఫరెండంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా? అని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. మోదీ ముమ్మాటికీ బీసీనే అని చెప్పారు. ‘‘మనిషి పుట్టిన వెంటనే కులం పేరు పెడతామా? రేవంత్ రెడ్డికి అట్లనే చేశారా? ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రధానిపై మాట్లాడేటప్పుడు అవాకులు, చవాకులు మాట్లాడతారా? అది రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని అన్నారు. శనివారం హైదరాబాద్​లోని టూరిజం ప్లాజా వద్ద మీడియాతో సంజయ్ మాట్లాడారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపి రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రానికి నివేదిక పంపితే, దాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. 

ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి పంపితే, రిజర్వేషన్లను ఆమోదించే ప్రసక్తే లేదు. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ డ్రామాలాడుతున్నది. కేంద్రంపై తప్పు నెట్టి, రాజకీయం చేయాలని చూస్తున్నది” అని మండిపడ్డారు. కాంగ్రెస్ కు దమ్ముంటే బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వే సక్రమమైతే, మళ్లీ ఎందుకు సర్వే చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంటింటికీ వెళ్లి కులగణన సర్వే చేపట్టి, కేంద్రానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు. ‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ మంత్రులు ఇద్దరే ఉన్నారు. కేసీఆర్ సర్వేలో 51శాతం, కాంగ్రెస్ సర్వేలో 46 శాతం బీసీలున్నట్టు లెక్కలు వేశారు. మరి ఈ లెక్కన ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉండాలి?” అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.