దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమని తెలిపారు.
కేటీఆర్ మాటలను బీఆర్ఎసోళ్లే పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు సంజయ్. బీఆర్ఎస్ ను గెలిపిస్తే సాధించిందేమిటి?... అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడం తప్ప అని అన్నారు. కేంద్రం ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చిందో వెల్లడించేందుకు సిద్ధమని, కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ గ్రామాలకు ఏం చేసిందో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో 99 శాతం మంది ప్రజలు దేవుడిని నమ్ముతారన్న సంజయ్... దేవుడినే నమ్మని నాన్ లోకల్ అభ్యర్ధి వినోద్ కుమార్ కు ప్రజలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. వినోద్ మేధావితనమంతా కేసీఆర్ కుటుంబానికే తప్ప ప్రజలకు ఉపయోగపడిందేమీ లేదన్నారు. ప్రజల సంగతి దేవుడెరుగు.. సొంత పార్టీ కార్యకర్తలే వినోద్ ను గుర్తు పట్టరని విమర్శించారు. స్థానికంగా ఉంటూ మీకోసం కొట్లాడే బండి సంజయ్ కావాలా? ఇతర పార్టీల నుండి పోటీ చేసే నాన్ లోకల్ అభ్యర్ధి కావాలా? ఆలోచించుకోవాలని సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానానికే పరిమితమని సంజయ్ తెలిపారు.