లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’
అసోం సీఎంతోపాటు కేరళ స్టోరీ యూనిట్‌కూ ఆహ్వానం: సంజయ్
జగిత్యాల ఎస్సై, ఆయన భార్య చేసిన తప్పేంటి?
ఎంఐఎం నాయకులు చెబితే సస్పెండ్ చేస్తారా అని నిలదీత
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో హిందూ సంఘ టిత శక్తిని చాటేందుకు 14న కరీంనగర్లో లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహిస్తున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ఈ యాత్రకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్‌తో పా టు ‘కేరళ స్టోరీ’ సినిమా యూనిట్ వస్తున్నదని చెప్పారు.
‘‘రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తూ హిందువులను హేళన చేస్తున్న కుహనా లౌకికవాదులకు చెంపపెట్టుగా ఈ యాత్ర నిర్వహిస్తం” అని పేర్కొన్నారు. హిందూ సోదరులం తా స్వచ్ఛందంగా యాత్రకు హాజరై హిందూ సం ఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి కరీంనగర్‌లోని వైశ్య భవన్ వద్ద హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను సంజయ్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోటీపడి కొన్ని పార్టీలు హిందువులను హేళన చేస్తున్నాయని, అందుకే హిందూ ధర్మ రక్షణ గురించి ఆలోచించే యువకులు, హిందూ సోదరులు ఏక్తా యాత్రలో పాల్గొనాలని కోరారు.
ఇక ఆర్టీసీ బస్సు గొడవ ఘటనలో జగిత్యాల ఎస్సైని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన భార్యపైనా కేసులు నమోదు చేయడాన్ని సంజయ్ ఖండించారు. ఎస్సై అనిల్ కుమార్ భార్య చిన్న కొడుకుకు పాలివ్వడానికి సీటు అడిగితే... పక్కనే ఉన్న బుర్ఖా వేసుకున్న మహిళ సీటు ఇవ్వకుండా తిడుతూ గొడవ పెట్టుకునే ప్రయత్నం చేసిందన్నారు.
ఈ ఘటనలో ఎలాంటి విచారణ లేకుండా ఎంఐఎం నాయకుల బెదిరింపులకు తలొగ్గి ఎస్సైని సస్పెండ్ చేసి కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరు సిగ్గుచేటని ఫైరయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ శనివారం జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సైపై సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలని, కేసులను ఉపసంహరించుకోవాలని, మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
సజ్జనార్ కు బండి సంజయ్ ఫోన్
జగిత్యాల బస్సులో ఎస్సై అనిల్ భార్యకు, మరో వర్గం మహిళతో జరిగిన గొడవ ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్ శుక్రవారం స్పందించారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో విచారణ చేయించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ఆయన ఫోన్ లో కోరారు.