హుస్నాబాద్, వెలుగు: ‘ప్రజల కోసం పనిచేసిన కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుత. నన్ను బిచ్చగాడంటున్నరు. ఓట్లు అడుక్కుంటున్న బిచ్చగాడినే. బండి సంజయ్ డబ్బులెన్ని సంపాదించిండని మంత్రి అంటున్నరు. నేను మంచి బట్టలేసుకోవద్దా? నేను ఎంపీని కానా? మీ లెక్క కోట్లు సంపాదించానా?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. తన రాజకీయ గురువు చొక్కారావును ఓడించిన జగపతిరావు కొడుకును వెంటేసుకుని తిరుగుతున్న పొన్నం ప్రభాకర్ గురువుకే పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు.
గౌరవెల్లి నిర్వాసితులను బీఆర్ఎస్ పోలీసులతో కొట్టిస్తే పొన్నం ప్రభాకర్ యాడ దాగున్నారని అన్నారు. ఎన్నికల టైమ్‌లో తప్ప బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ రావుకు చొక్కా నలగదు..చెమట పట్టదన్నారు. ‘ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా దూషిస్తారా? నా గుండుమీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలుపై ఎందుకు పెడుతలేరు?’ అని ప్రశ్నించారు.
వినోద్కుమార్ఫోన్ ట్యాపింగ్ పైసలతో టిక్కెట్ కొనుక్కుని ఆ సొమ్ముతోనే ఓట్లు కొనాలని చూస్తున్నడని విమర్శించారు. గడీలను బద్ధలు కొట్టి కేసీఆర్ ను గద్దె దించిన చరిత్ర తనదని, కరీంనగర్ పౌరుషంతో కేసీఆర్ అరాచకాలపై తిరగబడ్డానన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని, కాంగ్రెస్‌కు 'ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయబోమనే దమ్ముందా? అని ప్రశ్నించారు.