కేసీఆర్​కు కాంగ్రెస్​ మీదే నమ్మకం ఎక్కువ: బండి సంజయ్​

సీఎం కేసీఆర్​కు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కన్నా .. కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపైనే నమ్మకం ఎక్కువని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కరీంనగర్​57 వ డివిజన్​ 173 పోలింగ్​ బూత్​ పరిధిలో 'ఇంటింటికీ బీజేపీ' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్​ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా 30 మందిని ఎంచుకున్నారని.. వారు కాంగ్రెస్​ నుంచి గెలిస్తే బీఆర్​ఎస్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్​ చేశారని ఆరోపించారు.

ఆ అభ్యర్థులకు కేసీఆర్​ ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్​లో ఉన్నవారంతా తమ వారేనని కేసీఆర్​ ఫీలింగ్​అని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు జనంలోకి వెళ్తున్నారు. 9 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ప్రధాని మోదీ ఏం చేశారనేది బండి వివరించారు. అనంతరం పలువురితో కలిసి సెల్ఫీలు దిగారు. 

పకడ్బందీ ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు

లిక్కర్​స్కాంలో నిందితులు ఎంతటి వారినైనా దర్యాప్తు సంస్థలు విడిచిపెట్టబోవని బండి అన్నారు. వారిని తప్పించుకునేందుకు వీలు లేకుండా పకడ్బందీ ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ,ఈ డీ ఉందని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ ప్రచారం కోసం దశాబ్ది ఉత్సవాల పేరిట రూ.వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరణి బాధితులతో పరేడ్​ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. అక్కడ పెట్టే సభలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నడూ అమరవీరుల కుటుంబాల వైపు చూడని కేసీఆర్​ ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామనడం బీఆర్​ఎస్​ గిమిక్కులో భాగమేనని ఆరోపించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, ఎవరితో పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు. ఇవాళ ఒక్క రోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డబుల్​ బెడ్రూంలు కట్టడమే గగనంగా మారిందని, అక్కడక్కడ కట్టిన వాటిలో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కేసీఆర్​ సర్కార్​కేవలం కొన్నింటినే నిర్మించిందని అన్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో బీఆర్​ఎస్​ప్రచారానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుండటాన్ని ప్రశ్నించారు. 

రుణమాఫీ చేయలే..

అధికారంలోకి రాగానే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాఫీ చేయలేదని అన్నారు. దీంతో రైతులపై అప్పులు, మిత్తిల భారం ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్​చేశారు. 

విమర్శలు హుందాగా ఉండాలి..

తాను ఎంపీగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల సాయంతో గెలిచానని కాంగ్రెస్ సీనియర్​ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బండి అన్నారు. విమర్శలు హుందగా ఉండాలని పేర్కొన్నారు.  కాంగ్రెస్​పార్టీ మునిగిపోయే నావ అంటూ విమర్శించారు. బీజేపీలో చేరికలు ఆగిపోయాయా అనే ప్రశ్నకు.. సీఎం కేసీఆర్​ సర్కార్​ అవినీతికి వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారో ఆయా పార్టీల నేతలు గుర్తించాలని కోరారు.