తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు

రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖంగా  నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.వరంగల్ అర్బన్ లో  చాకలి ఐలమ్మ 35 వ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన ఆయన వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం తిరగబడ్డ తెగువ ఐలమ్మదన్నారు. మహిళా లోకానికి, ఉద్యమాలకు స్ఫూర్తి అయిన ఐలమ్మ ధైర్యానికి ప్రతీక.. సాయుధ పోరాటంలో వేగుచుక్క అని కొనియాడారు. ఆత్మబలిదానాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాలను మర్చిపోయారన్నారు. తలకాయ లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు బండి.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన నిజామాబాద్ జిల్లా మరుగున పడిందన్నారు. తెలంగాణ అమర వీరుల చరిత్రను కేసీఆర్ సర్కార్ కాలరాస్తుందన్నారు. తెలంగాణలో రానున్నది బిజెపి సర్కార్ అని అన్నారు. ముస్లింల కోసం తెలంగాణా ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు.  కేసీఆర్ ఓ వర్గానికి అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ఉద్యమంలో నిజాం పాలనను తిట్టిన కేసీఆర్, ఇప్పుడు నిజాం ఆదర్శంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు.

బిజెపి పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సంజయ్. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కేసీఆర్ కి దమ్ముంటే అమర వీరుల జాబితా తయారు చేసి ఇవ్వాలన్నారు. కేసీఆర్ పారసీటమాల్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకానికి కేంద్రమే నిధులిస్తుందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై కేసీఆర్ చర్చకి సిద్దామా అని సవాల్ విసిరారు బండి సంజయ్.