
- రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచరా?: బండి సంజయ్
- హెచ్‌సీయూ ఘటనపై వెంటనే విచారణ జరపాలి
- గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: అప్పులు చేయకుండా, భూములు అమ్మకుండా రాష్ట్రాన్ని పాలించే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ నెల జీతాలివ్వాలంటే కూడా భూములు అమ్మాల్సిందేనా? అంటూ నిలదీశారు. రాబోయే తరాలకు గజం భూమి కూడా లేకుండా చేస్తారా.. ఇదేం పాలన? అంటూ ఫైర్ అయ్యారు. ‘‘దీని కోసం మీరెందుకు.. కేఏ పాల్‌కు అప్పగించినా అదే పనిచేస్తారు కదా” అంటూ ఎద్దేవా చేశారు.
సోమవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తప్పుబట్టారు.‘‘ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోతారా? ఇదేం పద్దతి?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటైతయ్
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఏకం కాబోతున్నాయని సంజయ్ ఆరోపించారు. మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు కలిసే ఎంఐఎం అభ్యర్థికి మద్దతిస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు, సన్నబియ్యం పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కిలోకు రూ.40 చొప్పున ఇస్తుండగా, రాష్ట్రం రూ.10 మాత్రమే భరిస్తోందన్నారు. అలాంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ఫొటో పెట్టకపోవడం కరెక్ట్ కాదన్నారు.
ఎంఎంటీఎస్ బాధితురాలికి పరామర్శ
పద్మారావునగర్, వెలుగు: ఎంఎంటీఎస్ రైలులో తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన దుండగుడి నుంచి తప్పించుకోబోయి రైలు నుంచి దూకి గాయపడిన బాధితురాలిని బండి సంజయ్ పరామర్శించారు. సోమవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార యత్నం ఘటనలో నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు.
నిందితుడిని అరెస్టు చేసినట్లు అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో జరిగిన సంఘటనను ఇప్పుడు కొత్తగా రైల్వే పరిధిలోనిది అని చెప్పడం విడ్డురంగా ఉంది. మంచి జరిగితే మీకు, చెడు జరిగితే కేంద్రంపై నిందలు వేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. బాధితురాలిని అన్ని విధాలా ఆదుకుంటామని, హాస్పిట్ఖర్చులన్నీ తామే భరిస్తామని తెలిపారు.