ఫీజు బకాయిలు చెల్లించాలి .. ప్రభుత్వానికి బండి సంజయ్​ డిమాండ్​

ఫీజు బకాయిలు చెల్లించాలి .. ప్రభుత్వానికి బండి సంజయ్​ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు:  వేలాది కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో చాలామంది స్టూడెంట్స్​ చదువులకు దూరమయ్యారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బకాయిలు రిలీజ్ కాకపోవడంతో ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థతి వచ్చిందని తెలిపారు.  వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులు, కాలేజీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మహాత్మా జ్యోతిబాఫూలే జయంతిని నిర్వహించారు.  ఇందులో పాల్గొన్న బండి సంజయ్.. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం మాట్లాడుతూ.. మహాత్ముల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి నిజమైన నివాళి అని చెప్పారు. ఫూలే ఆశయాలకు కాంగ్రెస్  తూట్లు పొడిచిందని, రాష్ట్రంలో ఆయన ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతున్నదని విమర్శించారు.  అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికొదిలేసిందని మండిపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిందని అన్నారు.