బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలపై మర్డర్ కేసు పెట్టాలి : బండి సంజయ్‌‌ 

బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలపై మర్డర్ కేసు పెట్టాలి

ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం : బండి సంజయ్‌‌ 

అధికార మదంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నరు : డీకే అరుణ 

హైదరాబాద్, వెలుగు : ‘‘బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం ఆత్మీయ సమావేశాల పేరుచెప్పి సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై మర్డర్‌‌‌‌ కేసు కేసు నమోదు చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆత్మీయ సమ్మేళనాల్లో ముగ్గురు మృతి చెందడంపై బండి సంజయ్‌‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

మహబూబ్‌‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ఒకరు చనిపోవడం, పలువురు పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో విచ్చలవిడిగా కల్తీ కల్లు రాజ్యమేలుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యులను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సంజయ్‌‌ హెచ్చరించారు. 

ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు?: డీకే అరుణ

ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు బీఆర్ఎస్ నేతలకు ఎవరిచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని, గాయపడిన వారికి కార్పొరేట్ వైద్యం అందించడంతో బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌ చేశారు. బాధ్యులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్‌‌ పీఎస్సీ పేపర్ లీకేజీ, లిక్కర్ కేసులపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని ధ్వజమెత్తారు.

అధికార మదంతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ అమాయక ప్రజలను బలి పశువులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని ఆమె హెచ్చరించారు. చీమలపాడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడ్డ వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్‌‌ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన కోరారు.