మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు : బండి సంజయ్

  • ఈసీ ఏం చేస్తున్నది?
  • అధికారులపై బండి సంజయ్ ఫైర్
  • రూల్స్‌‌కు విరుద్ధంగా తిష్టవేస్తే పట్టించుకోరా?
  • ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలం
  • కేసీఆర్ ఆదేశాల మేరకే అధికారులు, పోలీసులు పని చేస్తున్నారు
  • ఎస్కార్ట్​ వాహనాలు, అంబులెన్స్​లలో డబ్బు తరలిస్తున్నరని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు : ప్రచార గడువు ముగిసినా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికల రూల్స్‌‌కు విరుద్ధంగా మునుగోడులోనే మకాం వేశారని, వాళ్లను అక్కడి నుంచి పంపించేయాలని ఈసీ అధికారులను బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘మేం నిబంధనల మేరకు ప్రచారం గడువు ముగియగానే అక్కడి నుంచి వచ్చాం. కాని ఇతర ప్రాంతాలకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రంతా డబ్బులు పంచారు. బుధవారం కూడా అక్కడే ఉంటూ డబ్బులు పంచారు’’ అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తుందా లేదా తేల్చుకోవాలన్నారు. 

తమ విజ్ఞప్తిని పిరికితనంగానో, మరో రకంగానో భావించవద్దన్నారు. ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని, సీఎం కేసీఆర్ ఆదేశాలకు తలొగ్గి అధికారులు, పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లను అక్కడి నుంచి వెంటనే వెళ్లగొట్టాలని, లేదంటే తమ పార్టీ కార్యకర్తలందరినీ మునుగోడుకు తరలిరావాలని పిలుపునిచ్చే పరిస్థితి కల్పించవద్దని స్పష్టం చేశారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం. బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉందని, తమ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసి టీఆర్ఎస్ ఏదో రకంగా అశాంతికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నది” అని ఆరోపించారు. టీఆర్ఎస్ రాళ్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ లీడర్ ప్రతాప్ రెడ్డిని, ప్రచారానికి వెళుతూ గాయపడ్డ కార్యకర్త రమేశ్ యాదవ్‌‌ను  సంజయ్ బుధవారం పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఇంత నీచానికి దిగాలా?
‘‘టీఆర్ఎస్ నేతలు తప్పతాగి కండకావరంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడి చేస్తూ.. తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు నా కాన్వాయ్‌‌ని అడ్డుకుంటూ దాడికి యత్నించారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వాహనాల్లోనే రాళ్లు, కర్రలు వేసుకొని మానవత్వం లేకుండా దాడులకు తెగబడుతున్నారు” అని సంజయ్ మండిపడ్డారు. 

చీరలు, బంగారం పంచుతున్నరు
‘‘మునుగోడులో ఎలాగైనా సరే టీఆర్ఎస్ గెలవాలనే సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లరగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల మీద పడి ఓటుకు 10 నుంచి  30 వేల రూపాయల చొప్పున పంచుతున్నారు. వారు మందు తాగుతూ.. జనానికి తాగిస్తున్నారు. చీరలు, బంగారం పంచుతున్నారు” అని బండి సంజయ్ ఆరోపించారు. సీఎంఓ నుంచి ఆదేశాలు అందడంతో వారంతా అక్కడే మకాం వేశారని, ఎస్కార్టు వాహనాల్లో, అంబులెన్స్‌‌లలో, ఆ పార్టీ మీడియా వాహనాల్లో డబ్బుల కట్టలను తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రుల గన్ మెన్లు, పీఏలు ఏం చేస్తున్నారో ఎలక్షన్ అధికారులు కనుక్కోలేకపోతున్నారా అని ప్రశ్నించారు.