కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ అక్రమాస్తులు కూడబెడ్తున్నరు
ఉద్యోగులు అల్లాడుతుంటే వీళ్లెందుకు సర్కార్‌ను నిలదీయరు?
ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పోరాడుతుంటే అరెస్టులా?
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం
నల్గొండ, వెలుగు : ‘‘సీఎం మోచేతి నీళ్లు తాగుతూ ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టి అక్రమాస్తులు కూడగట్టిన ఆ ముగ్గురు టీఎన్జీవో నాయకుల బండారం బయట పెడ్తా”అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. ఆ ముగ్గురు టీఎన్జీవో లీడర్లు ముక్కును నేలకు రాసి ఉద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని అడిగినందుకు నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేస్తరా? అని మండిపడ్డారు. ఆ ముగ్గురు టీఆఎన్జీవో నాయకులు ముక్కుకు నేలకు రాసి ఉద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల జీవితాలను స్వప్రయోజనాల కోసం ఫణంగా పెట్టి కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న దౌర్భాగ్యులు అని ముగ్గురు టీఎన్జీవో నేతలపై మండిపడ్డారు. ‘‘హెచ్ఆర్ ఏ తగ్గిస్తే కూడా నోరు మెదపని దద్దమ్మలు.. బీజేపీ పోరాడితే తప్ప జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో సర్కారు ఉంటే.. ఎన్నడైనా ఈ సర్కార్‌ను నిలదీశారా? మీకేమో కోట్ల ఆస్తులున్నయ్... కానీ, ఉద్యోగులు టైమ్‌కు జీతాలు రాక లోన్లు కట్టలేక, కిరాయి కట్టలేక అల్లాడుతున్నరు” అని ఆయన అన్నారు. ‘‘మూడు డీఏలు ఇయ్యలే.. సరెండర్ లీవ్స్ లేవు.. 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉద్యోగులు మారిన్రు.. దీనిపై టీఎన్జీవో నాయకులు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు” అని ప్రశ్నించారు. ‘‘ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిన పాపానికి అరెస్ట్ చేసి ఇయ్యాల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన్రు. నేను బరాబర్ మాట్లాడతా.. ఉద్యోగుల కోసం జైలుకు పోయిన. 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడిన. మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నరు... కేసులు ఎదుర్కొంటున్నరు.. ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే యాడ పోయిన్రు ఈ సోకాల్డ్ టీఎన్జీవో నాయకులు?” అని సంజయ్ మండిపడ్డారు. ‘‘ఏసీబీ కేసులో అడ్డంగా దొరికినోడు ఇయాళ మంత్రైండు. మీ జెండాలు కలిసినయ్... పార్టీలు కలిసినయ్.. సంతోషమే. కానీ కొంతమంది మనసులు కూడా కలిసినయ్.. మీ సంగతి తెల్వదా? నన్ను కెలికితే మీ బండారం బయటపెడతా...మీ సంగతి చూస్తా” అని హెచ్చరించారు.
మునుగోడులో జరిగేది కురుక్షేత్ర యుద్ధమే
కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో ఎగిరేది బీజేపీ జెండాననే సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో జరిగేది కురక్షేత్ర యుద్ధమేనని, ధర్మం బీజేపీ వైపే ఉంటుందన్నారు. ‘‘బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొ నగాడు, ఆపదొస్తే ఆదుకునే వ్యక్తి. కేసీఆర్‌ను గల్లా ప ట్టి గుంజుకొచ్చిన రాజగోపాల్‌రెడ్డి కావాల్నా? గడీల దగ్గర కాపాలా కాసే టీఆర్ఎస్ అభ్యర్థి కావాల్నా.. ము నుగోడు ప్రజలు ఆలోచించాలి” అని ఆయన కోరారు.
ఈటలపై దాడి చేస్తరా.. ఖబడ్దార్..!
ఈటల రాజేందర్‌పై దాడిని సహించేది లేదని, ఖబ డ్దార్ అని టీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ హెచ్చరించారు. మునుగో డు ప్రజల బాధలను, హామీలను ప్రస్తావించకుండా కేసీఆర్ పారిపోయారని ఆయన దుయ్యబట్టారు. ‘‘అన్ని కులాలను దారుణంగా మో సం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. 34 మంది ఆ ర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆత్మహ త్య చేసుకుంటే కనీసం స్పందించని మూర్ఖుడు కేసీఆర్” అని ఫైర్ అయ్యారు.
ఆర్ఎస్ఎస్ అంటే అంత భయమా?
‘‘నకలు కొట్టడానికి అకల్ ఉండాలే.. ఆర్ఎస్ఎస్ పేరిట టీఆర్ఎస్ లీడర్లు తప్పుడు సర్వే రిపోర్టులు ఇస్తున్నరు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఎందుకు రిపోర్ట్ ఇస్తది? ఆర్ఎస్ఎస్ అంటే ఇంత భయమా? టీఆర్ఎస్ లో ఉన్నోళ్లు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేయాలని కోరుకుంటున్నరు. ఇది గమనించే ఆర్ఎస్ఎస్ పై కేసీఆర్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నడు” అని బండి సంజయ్ మండిపడ్డారు.
జాతీయ గీతం కూడా తానే రాశానంటడేమో
‘‘మునుగోడులో ఉన్న సమస్యలేమిటి? ఏం హామీలిచ్చినం... ఎన్ని నెరవేర్చినం... ఎప్పుడు అమలు చేస్తం.. వంటి వాటి గురించి ప్రస్తావించకుండా భయంతో పారిపోయిన పిరికిపంద కేసీఆర్. కోదారి శ్రీనన్న రాసిన ‘సూడు సూడు నల్లగొండ’ పాటను కూడా తానే రాసినట్లు చెప్పుకున్న దొంగ కేసీఆర్. ఇట్లనే పోతే ఆఖరికి జాతీయ గీతం జనగణమన కూడా తానే రాసినని చెప్పుకుంటడు” అని సంజయ్ దుయ్యబట్టారు. ‘‘హెడ్మాస్టర్లతో బాత్రూంలను కడిగిస్తున్న మూర్ఖుడు కేసీఆర్. ఆయనకు బుద్ధి చెప్పాలి” అని అన్నారు. దొంగలెక్క మునుగోడుకు వచ్చి పోయిన కేసీఆర్... సర్కస్ లో జంతువుల మాదిరిగా ఆ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మళ్లా వెంట బెట్టుకుపోయిండు. అసలు మీ(టీఆర్ఎస్) అభ్యర్థి ఎక్కడ? దొంగ లెక్క తిరుగుతున్నడా?” అని ప్రశ్నించారు.
ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్.. అందుకే ఫేక్ లెటర్
తన పేరిట రాజీనామా లేఖపై బండి సంజయ్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో టీఆర్‌ఎస్ మోసగాళ్లు తాను రాజీనామా చేసినట్లు ఫేక్లెటర్సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన పేరిట వచ్చిన ఫేక్లెటర్ను ట్విట్టర్లో ఆయన మంగళవారం పోస్ట్‌చేశారు. టీఆర్ఎస్ అబద్ధాలకు నవంబర్ 3న బ్రేక్ పడుతుందన్నారు. మునుగోడులో బీజేపీ రికార్డు విజయం సాధిస్తుందని, ఇది సీఎం కేసీఆర్ ప్రజా జీవితానికి రాజీనామా చేసేందుకు దారి తీస్తుందని ట్వీట్‌చేశారు. సంజయ్ పేరిట ఫోర్జరీ లేఖను సృష్టించినోళ్లపై చర్యలు తీసుకోవాలని ఈసీకి, పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.