ఎన్నికల కోడ్ సాకుతో స్కీంలు ఆపితే ఊరుకోం : మంత్రి బండి సంజయ్ కుమార్

ఎన్నికల కోడ్ సాకుతో స్కీంలు ఆపితే ఊరుకోం : మంత్రి బండి సంజయ్ కుమార్
  • రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేయాలె: సంజయ్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా స్కీం నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రైతు భరోసా స్కీం కొనసాగుతున్న పథకమేననీ, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించినవనీ, ఈ స్కీంలతో ఎవరినీ ప్రభావితం చేసే అవకాశం కూడా లేదన్నారు.

.అవసరమైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికల సంఘానికి లేఖ పంపేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు శుక్రవారం బండి సంజయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేసి, వాటిని మంజూరు చేయాలని కోరారు.

ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా పైసలు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో స్కీం ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.