ప్రభుత్వానికి బండి సంజయ్ డిమాండ్లు ఇవే

కరీంనగర్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వం ఎదుట మూడు డిమాండ్లు పెట్టారు. ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో.. జైలు బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూనే.. మూడు డిమాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుట పెట్టారు. 

TSPSC పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని.. అప్పుడే దోషులందరూ బయటకు వస్తారని.. కచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని.. ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారాయన.

మరో డిమాండ్ పరిశీలిస్తే.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని.. ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారాయన.  30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని.. వారి తరపున మాట్లాడితే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించారని మండి పడ్డారు బండి సంజయ్. 

ఈ మూడు డిమాండ్లు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని.. ప్రతి జిల్లాల్లో.. ప్రతి మండలంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్. త్వరలో వరంగల్‌లో నష్టపోయిన యువతతో ర్యాలీ చేస్తామన్నారు . కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదని హెచ్చరించారాయన. 

https://www.youtube.com/watch?v=-0vol6wAVtU

https://www.youtube.com/watch?v=CSGPRH-hRfg