- ఓటుకు 10 వేలు, లక్ష సెల్ ఫోన్లు .. నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర : బండి సంజయ్
- గంగులకు వందల కోట్లు పంపుతున్నడు
- నేను గెలిస్తే వాళ్ల సంగతి చూస్తనని భయపడుతున్నరు
- కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం పలకాలని పిలుపు
కరీంనగర్/సంగారెడ్డి, వెలుగు: కరీంనగర్ లో తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఓటుకు రూ.10 వేలు, లక్ష సెల్ ఫోన్లు పంచేందుకు గంగుల కమలాకర్ కు వందల కోట్లు పంపాడని ఆయన అన్నారు. తాను గెలిస్తే కేసీఆర్ సంగతి చూస్తానని వారికి భయం పట్టుకుందన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్దుంపూర్, లక్ష్మీపూర్, మల్కాపూర్, కరీంనగర్ సిటీలోని కోతిరాంపూర్ లో బండి సంజయ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న తనలాంటి వాళ్లకు అండగా నిలవకపోతే కేసీఆర్, గంగుల కమలాకర్ వంటి అవినీతి, అక్రమార్కులను నిలువరించే వాళ్లు రాజకీయాల్లో ఉండబోరని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకుల అరాచకాలకు, కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు ప్రజలు అంతం పలకాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ భూములను లీజు పేరుతో దోచుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ను ఓడించి ఆర్టీసీని కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్లో ఆరు స్కీములు.. అరడజను సీఎంలు
ఆచరణకు సాధ్యం కాని ఆరు స్కీములతో ముందుకొచ్చిన కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం అరడజను మంది పోటీ పడుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశా రు. కర్నాటకలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో గురువారం బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సంజయ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో రామరాజ్యం రావాలి.. అందుకు ప్రతి హిందువూ బీజేపీకే ఓటు వేయాలని సంజయ్ సూచించారు.