- నా సమాజాన్ని అవమానిస్తే ఊరుకోం
- అయ్యప్ప స్వామిని దూషించినోళ్లకు బీఆర్ఎస్ కొమ్ముకాస్తున్నది: బండి సంజయ్
- ఉగ్రవాదులకు అడ్డాగా హైదరాబాద్
- హిందువులను నరికేస్తామన్న మూర్ఖుడిని కేసీఆర్ కాపాడిండు
- అన్ని స్కామ్‌లు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే
- బీజేపీ అధికారంలోకి రాకుంటే అనర్థాలు జరుగుతయ్
హైదరాబాద్, వెలుగు: అయ్యప్ప స్వామిని దూషించిన నిందితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘అయ్యప్ప మాలధారులపై లాఠీచార్జ్ చేయించిన ప్రభుత్వాన్ని ఏం చేద్దాం? హిందూ ధర్మాన్ని ఆపాలనుకోవడమేంటి? అల్లాను, జీసస్‌ను బీజేపీ ఎన్నడూ అగౌరవపర్చలే. నా సమాజాన్ని, కాషాయ జెండాను అవమానిస్తే ఊరుకోం’’ అని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు సంజయ్ చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ‘జై శ్రీరాం’ ‘స్వామియే శరణమయ్యప్ప’ అని నినదిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, ఈ విషయం కేసీఆర్‌కూ తెలుసన్నారు.
రజాకార్లను కూకటివేళ్లతో పెకలించాల్సిందే
రామరాజ్యం రావాలంటే రజాకార్లను కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఆలోచించాలని కార్యకర్తలను కోరారు. అందరికీ న్యాయం జరగాలని, ప్రజలకు భరోసా కల్పించాలనే ప్రజాసంగ్రామ యాత్ర చేశానన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్.. బీజేపీ ప్రశ్నిస్తుందని భయపడి రాష్ట్రం నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు. అన్ని స్కామ్‌లు కేసీఆర్ ఫ్యామిలీ నుంచే బయటపడుతున్నాయని ఆరోపించారు. ఇక్కడ ఓటు అడిగే హక్కును కేసీఆర్ కోల్పోయాడన్నారు. చిట్టీల కంపెనీలు బోర్డు తిప్పేసినట్లు టీఆర్ఎస్ బోర్డును బీఆర్ఎస్ పేరుతో తిప్పిండని మండిపడ్డారు. కేంద్రం ఎన్నో పథకాలకు నిధులు ఇస్తుంటే, వాటిని కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. ఇక్కడ దోచుకొని ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయ్యాక కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పమంటే చెప్పటం లేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరుగుతున్నదని స్పష్టం చేశారు.
నిషేధిత సంస్థలను కూడా కేసీఆర్ వాడుకుంటడు
అధికారం పోతుందంటే పీఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థలను కూడా కేసీఆర్ ఉపయోగించుకుంటారని సంజయ్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే సర్జికల్ స్ర్టైక్స్ చేసి తీరుతామని చెప్పారు. హైదరాబాద్ ఎవరి జాగీర్ కాదన్నారు. టెర్రరిస్టులకు అడ్డగా హైదరాబాద్ మారిందని ఆరోపించారు. ఎందుకు సర్జికల్ స్ర్టైక్స్ చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ఐఏ సోదాలు చేస్తేనే 11 మంది ఉగ్రవాదులు ఇక్కడ పట్టుబడ్డారన్నారు. వీసా, పాస్ పోర్ట్ లేకుండా ఇక్కడికి వచ్చి ఎంతో మంది బతుకుతున్నారని చెప్పారు. తాము మతాలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న దేశాన్ని చెడగొడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హిందువులను హైదరాబాద్‌లో నరికి వేస్తామన్న మూర్ఖున్ని కాపాడిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. హిందూ దేవుళ్లను అవమానించిన ఎంఐంఎం వ్యక్తులను వెనుకేసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చింతల రామచంద్రారెడ్డి, నేతలు గౌతం రావు, పల్లపు గోవర్ధన్, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం నుంచి పార్టీ బూత్ కమిటీ సమావేశాలు మొదలుపెట్టగా.. భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.