
ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన గడువు ఇయాళ్టితో ముగిసిందని చెప్పారు. కానీ వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వంద రోజుల్లోనే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని మోసం చేశారని సంజయ్ ఆరోపించారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15వేలు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వృద్ధులు, వితంతవులకు చేయూత కింద రూ.4 వేలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావన్నారు బండి సంజయ్. ఒక్క బైక్ పై 126 గొర్రెలు ఎక్కించినట్లు రూ.కోట్లు వసూలు చేసిన చరిత్ర వాళ్లదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పాలని, బీజేపీకి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.