మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలంతా బిచ్చమెత్తుకోవాల్సిందేనని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని బావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సంజయ్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై, మంత్రి గంగుల కమలాకర్ పై నిప్పులు చెరిగారు. కమలాకర్ తనని అవినీతిపరుడంటున్నాడని, డాక్యుమెంట్లతో రావాలని.. నా ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. నిరూపించకపోతే నీ ఆస్తిపాస్తులన్నీ కరీంనగర్ ప్రజలకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు.
రేషన్ మంత్రివైన నువ్వు.. ఇన్నాళ్లు రేషన్ కార్డులెందుకివ్వలేదని మంత్రి గంగులను నిలదీశారు సంజయ్ . కుటుంబానికి దూరమై ప్రజల కోసం కొట్లాడితే.. కేసీఆర్ తనకిచ్చిన గిఫ్ట్ 74 కేసులు అని చెప్పారు. గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతానన్న సంజయ్.. ఎమ్మెల్యే కాగానే ఎవడు అడ్డమొచ్చినా గ్రానైట్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి తీరుతానని చెప్పారు.