మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో జరిగిన నిరుద్యోగ మార్చ్ సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. నిరుద్యోగులపై బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్ కు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో సంబంధం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారో అని ప్రశ్నించారు.
ప్రజల తరుపున కొట్లాడుతున్న పార్టీ బీజేపీ. చరిత్రలో కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు లాఠీ దెబ్బలు తిన్నది, జైళ్లకు పోయింది లేదని సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంటగలిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కు, కేటీఆర్ పక్కా సంబంధం ఉంది. ఆయన కనుసన్నంలోనే పేపర్ లీక్ జరిగిందని ఆరోపించిన బండి సంజయ్.. కేటీఆర్ ను బేషరతుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు కూడా నిర్వహించే చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రానికొద్దని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వల్ల నిరుద్యోగులైన యువతకు నష్ట పరిహారంగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు.