కేసీఆర్ డైరెక్షన్ లోనే ఆడియో లీక్ : బండి సంజయ్

కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రికి వెళ్లిన సంజయ్... ఫాంహౌజ్ కొనుగోళ్లపై తడిబట్టలతో ప్రమాణం చేశారు. బీజేపీపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారన్న సంజయ్... దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు.  మునుగోడులో ఓడిపోతామనే భయం కేసీఆర్ కు పట్టుకుందని అందుకే  కొత్త కుట్రకు తెరలేపారన్నారు. ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో ఎందుకు దాచిపెట్టారు, స్వాధీనం చేసుకున్న రూ. 15 కోట్లు ఏమయ్యాయని  సంజయ్ ప్రశ్నించారు.

లీకైన ఆడియోలు కూడా సీఎం కేసీఆర్  డైరెక్షన్ లోనే లీక్ అయ్యాయన్నాని సంజయ్ ఆరోపించారు. నిజమైన ఆడియో అయితే సీఎం ఊరుకుంటారా? దొంగ ఆడియో రికార్డులు తయారు చేయడానికి వారికి రెండ్రోజులు పట్టిందని, నేరస్తులు, ఎమ్మెల్యేల కాల్‌లిస్టు బయట పెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఆడియో లీకులు అనేవి అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాకు ఐటమ్‌ సాంగ్‌ జోడించినట్టుందని సంజయ్ వెల్లడించారు. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమన్న సంజయ్.. ఈ ఉపఎన్నికతో టీఆర్ఎస్ కు సమాధి కడతమన్నారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన సంజయ్.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రమాణం చేశారు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లిన సంజయ్.. గర్బగుడి ముందు నిల్చుని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ లీడర్లకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. సవాల్ ప్రకారం తాను ప్రమాణం చేశానని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు రాలేదని సంజయ్  ప్రశ్నించారు.