తెలంగాణ సమాజం ఛీత్కరించిన కేసీఆర్కు బుద్ది రాలేదు: బండి సంజయ్


కేసీఆర్ ను తెలంగాణ సమాజం ఛీత్కరించిన బుద్దిరాలేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  నిన్న కరీంనగర్ లో కదనభేరి సభలో  కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్ ఇచ్చారు.  కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  సంజయ్ మాట్లాడారు.  

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధులే కరువయ్యారని...  ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నారని విమర్శించారు బండి సంజయ్.  మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే రూ.500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదని కేసీఆర్ ను సంజయ్ ప్రశ్నించారు. కేసీఆరే పెద్ద అవినీతిపరుడంటూ సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పాత అంశాలను తోడి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్  కుట్ర చేస్తున్నారని ఫైరయ్యారు.  

భద్రాచలంలోని 7 మండలాలను ఏపీలో విలీనానికి ఓకే చెప్పిందే కేసీఆర్ అంటూ ఆరోపించారు సంజయ్. అఫ్ట్రాల్ 7 మండలాలు పోతే పోనీ... తెలంగాణ వస్తుంది కదా అన్నదే కేసీఆర్ అని అన్నారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నిధులు కేసీఆర్ ఇచ్చిండా?... కేంద్రం కదా మంజూరు చేసిందా అని సంజయ్ ప్రశ్నించారు.  కేంద్రం స్మార్ట్ సిటీ కింద కేంద్రం రూ.196 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కింద అదనంగా రూ.196 కోట్లు ఆనాడు ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. స్మార్ట్ సిటీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తే తాను కేంద్రానికి ఫిర్యాదు చేశానని చెప్పారు.  

లక్ష ఓట్లతో లక్షణంగా ఓడిపోయిన చరిత్ర వినోద్ కుమార్ ది అని విమర్శించారు బండి సంజయ్.  కేసీఆర్ ముఖాన్ని జనం ఛీత్కరించారు.. వినోద్ ముఖానికి ఓట్లు పడే పరిస్థితి లేదన్నారు.  పార్లమెంట్ లో 106 సార్లు మాట్లాడి వినోద్ కుమార్ సాధించేదేమిటి? అని ప్రశ్నించారు.  కరీంనగర్ -వరంగల్, కరీంనగర్-జగిత్యాల, ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణకు నిధులెందుకు తీసుకురాలేదన్నారు.  ఆ రోడ్ల విస్తరణ కోసం కేంద్రాన్ని ఒప్పించి దాదాపు రూ.5 వేల కోట్ల నిధులను తాను తీసుకొచ్చినని తెలిపారు.