కేసీఆర్ కొడుకు ముఖం చూసి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని విమర్శించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రి పదవి కోసం కొడుకు పేరును కేటీఆర్ గా మార్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వి అన్నీ మోసాలేనని.. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. కేసీఆర్ ఎంతటి మోసగాడో, బట్టేబాజ్ గాడో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్డు మీదకు తీసుకొచ్చానని.... కరీంనగర్ పేరు మారుమోగేలా చేసానంటే తనను ఇక్కడి ప్రజలు గెలిపించడంవల్లే సాధ్యమైందన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ సమక్షంలో 500 మంది యువకులు బీజేపీలో చేరారు.
తాను కరీంనగర్ నుంచి బరిలోకి దిగుతానంటే బీఆర్ఎస్ వాళ్ల గుండెల్లో డప్పులు మోగుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. దారుస్సలాం పోయి పచ్చ టోపీలు పెట్టుకుని ఓవైసీ ఆశీస్సులతో తనను ఓడించాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రలోభాలు, డ్రగ్స్ ఆశ చూపి యువకులను లోబర్చుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. యువకులారా... మళ్లీ రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. సీఎం పదవి తన చెప్పుతో సమానమన్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలన్నారు. ఇంకా మౌనంగా ఉంటే.. హైదరాబాద్ లో ఉన్న దారుస్సలాంను కరీంనగర్ కు తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఇతర పార్టీల నాయకులు, యువకులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు బీఆర్ఎస్ ఆఫర్ చేస్తోందని ఆరోపించారు. పొరపాటున ఎవరైనా యువకులు బీఆర్ఎస్ లో చేరితే జనం వారిని దొంగలుగా, ప్రలోభాలకు లొంగిన వారుగా చూస్తున్నారనే సంగతిని మర్చిపోవద్దని సూచించారు.
తాత్కాలిక ప్రయోజనాల కోసం డబ్బుకు, ఇతరత్రా ప్రలోభాలకు లొంగితే అది బతుకే కాదని.... నీతోపాటు నీ కుటుంబానికి తలవంపులు తప్పవన్నారు.
దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తే అంతకు మించిన ఆత్మ సంతృప్తి ఇంకోటి లేదన్నారు బండి సంజయ్. ఎన్నికలు వస్తుంటాయ్.. పోతుంటాయ్... నిత్య జీవితంలో మన ఆచరణే ముఖ్యమన్నారు. తాను హిందుత్వ గురించి మాట్లాడకపోతే... రాష్ట్రంలో ఎవరూ బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఆ దుస్థితి రాకూడదనే బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
- ALSO READ | అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి కిషన్రెడ్డి
దారుస్సలాం పార్టీకి సవాల్ చేసి పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గర మీటింగ్ పెట్టి హిందుత్వ సత్తా ఏందో చూపించానని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా హిందుత్వ ఓటు బ్యాంకు ఏకమవుతోందన్నారు. బీజేపీ కార్యకర్తలను, యువకులపై అక్రమంగా కేసులు పెడితే ఖబడ్డార్ అంటూ పోలీసులను హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలన ఉండేది 50 రోజులేనని... వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.