కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని... అన్నీ తానే చేసానని ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల బతుకు బర్బాజ్ కావడానికి కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమని చెప్పారు. మే 5వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. మార్నింగ్ వాక్ కు వచ్చిన వారిని కలిసి ఓటు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఓ మాట, ముఖ్యమంత్రి అయ్యాక మరో మాట అన్నట్లుగా కేసీఆర్ ప్రవర్తించారని అన్నారు. పంట నష్టపోయినా, ధాన్యం కుప్పలపై రైతులు చనిపోయినా.. స్పందించని కేసీఆర్.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. తెలంగాణ రైతులకు డబ్బులు ఇవ్వకుండా.. పంజాబ్ రైతులకు ఇచ్చాడని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హామీలు నెరవేర్చలేదుని.. పోడుభూముల సమస్యను తీర్చలేదని అన్నారు.
కేసీఆర్ కుటుంబం ధనవంతులైతే.. రాష్ట్ర ప్రజలు మరింత పేదలుగా మారారని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ బిడ్డ తెలంగాణ డబ్బులను ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో పెట్టిందని మండిపడ్డారు. ప్రజలంతా కేసీఆర్ పాలనలో జరిగిన నష్టాలు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఢీల్లికి డబ్బులు పంపడానికి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంలాగా మార్చారని విమర్శించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా... ఫోన్ ట్యాపింగ్ నిందితుడైన ప్రభాకర్ రావు పంపిస్తున్నవేనన్నారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థికి ఫోన్ ట్యాపింగ్ నిందితుని నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్పోరేటర్లకు ఐదు లక్షలు రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ కొనుక్కొందని బండి సంజయ్ ఆరోపించారు.