
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు బీజేపీకే ఉందన్న కేంద్రమంత్రి
- మంచిర్యాలలో రోడ్‌షో, పట్టభద్రులతో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం
మంచిర్యాల, వెలుగు: ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఐదారు నెలలే. ఆ తర్వాత ప్రభుత్వం ఉంటదో ఊడుతదో కాంగ్రెస్ వాళ్లకే తెల్వదు. తదనంతరం అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా వ్యవహరించే వాళ్ల సంగతి చూస్తామని అన్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాలకు వచ్చిన ఆయన బీజేపీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్యే కె.వెంకటరమణారెడ్డితో కలిసి ఐబీ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్, స్టేషన్ రోడ్ మీదుగా రోడ్‌షో నిర్వహించారు.
అనంతరం గోదావరి రోడ్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 55వేల పోస్టులు భర్తీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్ను మించిపోయారని సంజయ్ విమర్శించారు.
రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, బడ్జెట్లో రూ.7వేల కోట్లు కేటాయించినట్టు ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క ఇల్లయినా కట్టించారా? అని నిలదీశారు. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన నిరుద్యోగుల పక్షాన పోరాడిన బీజేపీకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు ఉందన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదీయాలని టీచర్లకు, గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అవినీతి, మోసాలు చూసి ప్రజలంతా బీజేపీ పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘‘కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి పరిస్థితి గందరగోళంగా మారింది. ఆయనకు ఏజెంట్లు లేరు, ప్రచారం చేసే నాయకులు లేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయనను గెలిపించాలనే ఆలోచనే లేదు చివరకు ఆయన సొంత కాలేజీ స్టాఫ్‌ను పట్టుకొని తిరుగుతున్నరు’’ అని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో కొంతమంది దాదాగిరి చేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వాళ్ల సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు.