సెల్ ఫోన్ పోయిందని బండి సంజయ్ కంప్లైంట్

  • ఫోన్ పోయిందని సంజయ్ కంప్లైంట్
  • వెతికి ఇవ్వాలని కరీంనగర్ టూటౌన్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు మెయిల్
  • బీజేపీ టాస్క్​ఫోర్స్ కమిటీ, లీగల్ సెల్‌‌‌‌‌‌‌‌ నేతలతో సంజయ్ భేటీ
  • తన ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందని ఆరోపణ
  • మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేశారని తెలిసి కేసీఆర్​కు మూర్ఛ వచ్చినట్టుందని ఎద్దేవా

కరీంనగర్, హైదరాబాద్, వెలుగు : పోలీసులు తనను అరెస్ట్ చేసి స్టేషన్‌‌‌‌కు తరలించే సమయంలో తన ఫోన్ మిస్‌‌‌‌ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌‌‌‌ను వెతికి ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ టూటౌన్ పోలీసులకు మెయిల్ ద్వారా ఆదివారం ఆయన కంప్లైంట్ చేశారు. ‘‘కరీంనగర్ ఏసీపీ, టూటౌన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేశాక వ్యాన్‌‌‌‌లో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌‌‌‌లోని బొమ్మల రామారం స్టేషన్‌‌‌‌కు తరలించే సమయంలో ఫోన్ పోయినట్లు గుర్తించాను. భద్రతా కారణాల దృష్ట్యా నేను నా సోదరి డాక్టర్ సౌమ్య పేరు మీద ఉన్న సిమ్‌‌‌‌ను ఉపయోగిస్తున్నాను.

హనుమకొండ జిల్లా కమలాపూర్ పీఎస్ లో నమోదైన సీఆర్.60/2023 కేసులో నన్ను రిమాండ్ చేసినప్పుడు నా తరఫు అడ్వకేట్లకు ఫోన్ పోయిన విషయం చెప్పాను. బెయిల్ కోసం వాదనలు జరుగుతున్న సమయంలో మొబైల్ మిస్సయిన విషయాన్ని మేజిస్ట్రేట్ దృష్టికి వారు తీసుకెళ్లారు. నన్ను కస్టడీలోకి తీసుకున్నప్పుడు మొబైల్ నా దగ్గర ఉన్నట్లు గుర్తుంది. నా కాంటాక్ట్ నంబర్లు, ఇతర ముఖ్యమైన సమాచారం ఆ ఫోన్ లో ఉన్నందున నా మొబైల్‌‌‌‌ను వెతికి ఇవ్వాలని కోరుతున్నా” అని తన ఫిర్యాదులో బండి సంజయ్ పేర్కొన్నారు.

కస్టడీ సమయంలోనే ఫోన్ పోయిన విషయం నోటిమాటగా చెప్పానని, దీంతో పోలీసులు ఇప్పటికే తన ఫోన్ విషయంపై ఎంక్వైరీ ప్రారంభించి ఉండొచ్చని తాను అనుకున్నానని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌‌‌‌ని ఏ1 నిందితుడిగా హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఆయన ఫోన్ కీలకమని, ఫోన్ ఇస్తే కీలక సమాచారం వస్తుందని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన ఫోన్ పోయిందని, వెతికిపెట్టాలని బండి సంజయ్ కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సుప్రీం, హైకోర్టు జడ్జిలకు లేఖలు రాస్తం

టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు లేఖలు రాస్తామని బండి సంజయ్ చెప్పా రు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ టాస్క్​ఫోర్స్ కమిటీ, లీగల్ సెల్ నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాన కోచింగ్ సెంటర్ల వద్ద పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని నేతలకు సూచించారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ఉద్యమించాలన్నారు. చిన్న తప్పు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విఫలమవుతున్నదని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

తన ఫోన్‌‌‌‌ను పోలీసులే మాయం చేశారని సంజయ్ ఆరోపించారు. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది తనకు ఫోన్ చేసి మాట్లాడారని, అది తెలిసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మూర్ఛ వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. తన ఫోన్ బయటికొస్తే చాలా విషయాలు తెలుస్తాయనే.. కేసీఆర్ వద్దే పెట్టుకుని ఉంటారని ఆరోపించారు. ఎదుటోళ్ల ఫోన్ల సంభాషణను వినడమే కేసీఆర్ పని అని మండిపడ్డారు.

సమస్యలు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు కనిపిస్తలే

కంటివెలుగులో కేటీఆర్ టెస్టులు చేయించుకోవాలని సంజయ్ సూచించారు. రాష్ట్రంలో సమస్యలు మంత్రికి కనిపించడం లేదంటూ ట్వీట్ చేశారు. ‘‘ద్రవ్యోల్బణంలో నంబర్ వన్.. జాబ్ ల భర్తీలో విఫలం.. టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్ లీకేజ్.. పెరుగుతున్న సైబర్ క్రైమ్స్.. సౌత్ ఇండియాలో మహిళలపై దాడుల్లో నంబర్ వన్.. సర్పంచ్‌‌‌‌ల ఆత్మహత్యలు.. మహిళలపై పెరిగిన నేరాలు.. గురుకులాల్లో కల్తీ ఆహారం ఘటనలు.. ఎడ్యుకేషన్, హెల్త్ కు బడ్జెట్ లో తక్కువ నిధుల కేటాయింపు.. ప్రజల తలసరి అప్పుల్లో టాప్‌‌‌‌లో ఉండటం..” అంటూ ఓ లిస్టును షేర్ చేశారు.