పార్టీ టైంలో ఫామ్​హౌస్​లోనే కేటీఆర్: బండి సంజయ్

పార్టీ టైంలో  ఫామ్​హౌస్​లోనే కేటీఆర్: బండి సంజయ్
  • కావాలంటే టవర్ లొకేషన్స్​తో గుర్తించండి: బండి సంజయ్​
  • దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేసేవాళ్లూ పార్టీలో ఉన్నరు
  • కేటీఆర్​ను కొందరు పోలీసులు తప్పించారని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: పార్టీ జరుగుతున్న సమయంలో జన్వాడ ఫాంహౌజ్ లో  కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులున్నట్టు సమాచారం ఉన్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. వారితోపాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వాళ్లు కూడా ఈ పార్టీలో ఉన్నట్టు  తెలిసిందని చెప్పారు. కొందరు పోలీసులు కావాలనే కేటీఆర్​ను తప్పించారని  అన్నారు. హోం శాఖ సీఎం వద్దే ఉన్నా.. ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఇన్నాళ్లు తాము చెబుతున్నది నిజమేనని మరోసారి రుజువైందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ బామ్మరిది రాజ్ పాకాల  ఇంట్లో జరిగిన పార్టీపై ఆదివారం బండి సంజయ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్ తో సీఎం రేవంత్​కు ఉన్న దోస్తీతోనే కేటీఆర్​ను వదిలేశారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్ర్ రహిత రాష్ట్రంగా మారుస్తామని చేసిన ప్రభుత్వ ప్రకటనలన్నీ డొల్లేనా?” అని ప్రశ్నించారు. 

డ్రగ్స్ రహిత రాష్ట్రమంటే కేటీఆర్ కుటుంబ సభ్యులను తప్పించడమేనా? అని అడిగారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడున్న టవర్ లొకేషన్స్ ఆధారంగా కేటీఆర్ అక్కడున్నారో? లేదో? అనేది గుర్తించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజీలను వెంటనే బహిర్గతం చేయాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే కేటీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని, లేదంటే వారు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అన్నారు. 

సుద్దపూస ఇప్పుడేమంటాడో?

‘‘ఈ రేవ్​పార్టీ ఇష్యూపై సుద్దపూస ఇప్పుడేమంటాడో” అని కేటీఆర్​ను ఉద్దేశించి బండి సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా కేటీఆర్ ఇంకా బుకాయిస్తాడేమోనని అన్నారు. సమాజాన్ని  భ్రష్టుపట్టిస్తున్న  డ్రగ్స్ పై కాంగ్రెస్​కు రాజీధోరణి ఎందుకని,  కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్​ సిగ్గుచేటని విమర్శించారు. బడా నేతలతోసహా ఈ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ ఫాంహౌజ్ రేవ్ పార్టీ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందన్నారు.  లిక్కర్ పార్టీయే తప్ప రేవ్ పార్టీ కాదని బుకాయించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.  రేవ్ పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని అన్నారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చే కుట్ర మొదలైందని తెలిపారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఇచ్చే దివాళీ గిఫ్ట్ ఇదేనా?  అంటూ ఎద్దేవా చేశారు. 

కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులున్నట్టు ఫొటోలతోసహా టీవీల్లో వస్తున్నా ఆ దిశగా విచారణ ఎందుకు జరపడం లేదని సంజయ్​ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, గొర్రెల స్కాం మాదిరిగానే ‘రేవ్ పార్టీ’ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. సర్కార్ కు దమ్ముంటే రేవ్ పార్టీలో పాల్గొన్న 35 మంది పేర్లు బయటపెట్టాలని, కేటీఆర్​తోపాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్​ ఫాంహౌజ్​ను ఎందుకు కూల్చలే?

అక్రమ నిర్మాణాలంటూ పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తున్నదని, మరి ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించిన కేటీఆర్ ఫాంహౌజ్ ను ఇంతకాలం ఎందుకు కూల్చలేదో సర్కార్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్​ చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. జన్వాడ ఫాంహౌజ్ లో దాచుకున్న ముఖ్యమైన ఫైళ్లన్నీ ఓ స్టార్ హోటల్ కు తరలించారని ఆరోపించారు. 

అక్కడ జరిగింది ముమ్మాటికీ  డ్రగ్స్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ మాత్రం ఏమీ ఎరుగనట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వం చిత్తుశుద్ధితో విచారణ జరిపితే ఆయన చావు తెలివి తేటలు బయటపడతాయని పేర్కొన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని బండి సంజయ్​ డిమాండ్ చేశారు.     

కేటీఆర్​లో భయం కనిపిస్తున్నది

కేటీఆర్ లో భయం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఆయన తప్పు చేసి మీడియాను నిందిస్తారా? అని బండి సంజయ్  అన్నారు. కేటీఆర్​తప్పు చేయకుంటే మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా బదులివ్వకుండా ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఫాంహౌజ్ నుంచి ఎందుకు పరారయ్యారని, సొంత బామ్మర్ది ఇంటి ఫంక్షన్​కు కేటీఆర్​ పోలేదంటే ఎలా నమ్మాలి? అని అనుమానం వ్యక్తం చేశారు. 

మామూలు ఫంక్షన్ అయితే అక్కడ క్యాసినో కాయిన్స్ ఎందుకున్నాయని, ఫంక్షన్ కు కేటీఆర్​తోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లారా? లేదా? అనేది చెప్పాలని  డిమాండ్ చేశారు. మామూలు ఫంక్షన్ అయితే డీజీపీతో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అరెస్ట్ అయితే ఏనాడూ డీజీపీకి ఫోన్ చేయని కేసీఆర్.. ఈరోజే ఎందుకు ఫోన్ చేశారని ప్రశ్నించారు.