దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనగామ జిల్లా దేవరుప్పలలోని శ్రీసాయి ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో ముచ్చటించారు. ఎంతోమంది మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్య్రం సిద్ధించిందని ఆయన తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని..కాబట్టి విద్యార్థులు బాగా చదివి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
కాగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మోడీ అన్నారు. యావత్ జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వాళ్లను మరువలేమని పేర్కొన్నారు.‘‘ వచ్చే 25 ఏళ్లలో దేశ ప్రజలు 5 అంశాలపై ప్రధాన దృష్టిపెట్టాలి. 2047 సంవత్సరంకల్లా దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదలాలి. ఆ ఐదు అంశాల్లో మొదటిది.. అభివృద్ధిచెందిన దేశంగా భారత్ ను నిలపడం. రెండోది దేశంలో ఇంకా ఎక్కడైనా కొంచెం బానిసత్వం ఉన్నా నిర్మూలించాలి. మూడోది.. దేశ చరిత్ర, స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలపై గౌరవం ఉండాలి. నాలుగోది.. ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలి. ఐదోది.. దేశం కోసం దేశ లక్ష్యాల కోసం కృషిచేయాలనే వజ్ర సంకల్పం మనలో ఉండాలి’’ అని మోడీ చెప్పారు.