బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: బండి సంజయ్

బీజేపీ శ్రేణులు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని బండి సంజయ్ అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాట బాట పట్టాలని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి అధ్యక్షతన.. కరీంనగర్‭లోని రేకుర్తిలో జరిగిన జిల్లా, మండల పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. జిల్లా పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి  పోలింగ్ బూత్ కమిటీ, శక్తి కేంద్రాలను మరింత పటిష్టం చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు  సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. 

కేసీఆర్ పాలనతో విసిగిపోయి.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపీ వైపు ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. కుటుంబ పరిపాలనలో బందీ అయిన తెలంగాణ రాష్ట్ర విముక్తికై బీజేపీ శ్రేణులు నడుం బిగించాలని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి కృషి చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విజయవంతం కోసం.. కష్టపడిన జిల్లా శ్రేణులందరికీ బండి సంజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు.