కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులపై అధికారులను ఆరా తీశారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. జనవరి 11వ తేదీ గురువారం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, తీగలగుట్ట పల్లి ఆర్ఓబీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. మార్చి నెలాఖరులోపు ఆధునీకరణ పనులను పూర్తయ్యే అవకాశముందని, భూసేకరణలో ఇబ్బంది ఎదురవుతోందని బండి సంజయ్ కి అధికారులు తెలిపారు.
దీంతో ఆర్ అండ్ బీ అధికారుల పని తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు భూసేకరణ సమస్య ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. భూసేకరణ సాకుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని అన్నారు. ఆర్ఓబీ పనుల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దన్నారు. ఆర్ఓబీ పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్లు కొట్టుకుపోయి దుమ్ము, ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వెంటనే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు చేయాలని చెప్పారు. ఆర్ఓబీ కాంట్రాక్టర్ ఎందుకు రాలేదని కోపడ్డారు బండి సంజయ్. పనుల్లో నాణ్యత లోపిస్తున్నా, ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారని.. నిర్ణీత వ్యవధిలో ఆర్ఓబీ పనులను పూర్తి చేయాల్సిందేనని అన్నారయన. నాసిరకం పనులు చేస్తే కాంట్రాక్టర్ ను వదిలేపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పనుల విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాల్సిందేనన్నారు. ఆర్ఓబీ నిధులన్నీ కేంద్రానివేననే సంగతిని గుర్తుంచుకోవాలని అన్నారు.
అనంతరం బండి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ కోసం రక్తం చిందించారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమే తప్ప.. రక్తం ఎక్కడిదని ఎద్దేవా చేశారు. ప్రజల రక్తాన్ని పీల్చుకున్న తిన్న రాబందు రక్తం చిందించెప్పుడు? అని అన్నారు. రాష్ట్రం కోసం రక్తం చిందించింది బీజేపీ కార్యకర్తలేనని.. ప్రజా సమస్యలపై పోరాడిన బీజేపీ కార్యకర్తలను కొట్టించిన సంగతి మర్చిపోయారా? అని ఫైర్ అయ్యారు. ప్రజలను దోచుకుతిన్న విషయాన్ని మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నడు? అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం దోచుకోని పని ఏదైనా ఉందా?.. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లమన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అరాచకాలు, అవినీతి, అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇంకా ఎందుకు ఉపేక్షిస్తుందో అర్ధం కావడం లేదన్నారు.