కేసీఆర్​ కొడుకును సీఎం చేస్తడు.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల్ని అవమానిస్తడు : బండి సంజయ్​

జగిత్యాల జిల్లా : “బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లారా... మీరెప్పటికీ సీఎం కాలేరు. కొడుకును సీఎం చేసి మిమ్ముల్ని కేసీఆర్​ అవమానిస్తరు. అందుకే బీజేపీతో కలిసి రండి... ప్రగతి భవన్ బద్దలు కొడదాం”అని తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్ పిలుపునిచ్చారు. వచ్చే ప్రభుత్వంలో పోలీసులు మొట్టమొదట ఉరికించేది కేసీఆర్ నే అని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ప్రజాసంగ్రామ పాదయాత్ర రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడారు. లక్ష కోట్ల దొంగ సారా దందాతో రాష్ట్రం తలదించుకునే దుస్థితి తెచ్చిన  కేసీఆర్ బిడ్డను ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు.  ‘‘నీ బిడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలా?... ఆమెను అరెస్ట్ చేస్తే ఎందుకు నిరసన తెలపాలి?”అని ఆయన కామెంట్​ చేశారు.

టీఆర్ఎస్ పేరు నుంచి తెలంగాణను తీసేసినందుకు రాష్ట్ర ప్రజలకు కేసీఆర్  క్షమాపణ చెప్పాలన్నారు. బొంబాయి, దుబాయ్, బొగ్గు బాయి నినాదం ఏమైందని కేసీఆర్​ ను బండి సంజయ్​ ప్రశ్నించారు. గల్ఫ్ లో చచ్చిపోయిన ప్రవాస భారతీయుల శవాలను వారం రోజుల్లో కూడా తీసుకురాలేని చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదేనా? అని ప్రజలను అడిగారు. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి అమరుల త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్​ డైవర్ట్ చేస్తుండన్నారు. తెలంగాణలో కాషాయపు రాజ్యం వస్తే రజాకారుల వారసులను తరిమికొడతామని బండి సంజయ్​ హెచ్చరించారు.