మునుగోడులో ఈ నెల 17నుంచి బండి సంజయ్ ప్రచారం చేస్తారని బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. కేసీఆర్ సింగరేణి తాడిచెర్లలో 3200కోట్ల అవినీతికి పాల్పడ్డారని..ఆయన అవినీతి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని తెలిపారు. అప్పటి శ్రీలంక ప్రధాని రాజపక్స అవినీతితో విమానాలు కొంటె ప్రజలు బుద్దిచెప్పారని..తెలంగాణ రాజపక్స అయిన కేసీఆర్ ను కూడా ప్రజలు గద్దె దించుతారని అన్నారు.
మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చండూర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాజ్ గోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం ఇవాళ నామినేషన్ వేయనున్నారు. అనుచరులతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు.